ఢిల్లీలో ధర్నాకు సీఎం కేసీఆర్ వస్తారా? టీఆర్ఎస్ క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: అవసరం అనుకుంటే ధర్నాకు సీఎం కేసీఆర్ వస్తారని, ముఖ్యమంత్రి దిశానిర్దేశంలోనే ధర్నా జరుగుతుందని, సీఎం
దిశ, తెలంగాణ బ్యూరో: అవసరం అనుకుంటే ధర్నాకు సీఎం కేసీఆర్ వస్తారని, ముఖ్యమంత్రి దిశానిర్దేశంలోనే ధర్నా జరుగుతుందని, సీఎం హాజరవుతారా? లేదా? అన్నది ఈ నెల 11న ఉదయం చెబుతామని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ధర్నా ఏర్పాట్లను శుక్రవారం ఎంపీలు జోగినిపల్లి సంతోష్ కుమార్, చేవేళ్ల ఎంపీ జి. రంజిత్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ధర్నా వేదిక, భోజన,వసతి, హోర్డింగ్ తదితర ఏర్పాట్లపై తెలంగాణ భవన్ అధికారులు, పోలీసులతో చర్చించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ క్యాబినెట్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు,ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు ధర్నాలో పాల్గొంటారని తెలిపారు. వరి ధాన్యం సేకరించాలనే డిమాండ్‌తో రైతులకు అండగా ఉండేలా ధర్నా కొనసాగనుందన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో వరి సాగు 600శాతం వృద్ధి చెందిందని, తెలంగాణ రైతులు 3కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండించారన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో రైతుల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. పంజాబ్, హర్యానా మాదిరిగా ఎఫ్ సీ ఐ తెలంగాణలో ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. గతంలో ఏ విధంగానైతే ఎఫ్సీఐ ధాన్యం కొనుగోలు చేసిందే అదే విధంగా రాష్ట్రంలో కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోలు చేయకపోతే కేంద్రం తగిన మూల్యం చెల్లంచుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ దమ్ము, తడాఖా చూపుతామన్నారు.
ప్రతి గ్రామం, మండలం, జిల్లా కేంద్రంలో ధర్నా చేశాం, ఈ ధర్నాను ప్రజా ప్రతినిధుల వరకే పరిమితం చేశామని, ఇప్పటికైనా కేంద్రం తెలంగాణ నుంచి ధాన్యం సేకరించాలన్నారు. 14 ఏళ్లు కష్టపడితే తెలంగాణ వచ్చిందని, పంజాబ్, హర్యానా రైతులు కూడా ఇలాగే పోరాటం చేస్తే ధాన్యం సేకరించారన్నారు. కేంద్రం చేతిలోనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గోడౌన్లు, సేకరణ అంశాలున్నాయన్నారు. ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితి కొనుగోలుకు సహకరించదని, కొనుగోలు, సరఫరా బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు తలాతోకా లేదని మండిపడ్డారు. వారు ఏం మాట్లాడుతున్నారే వారికే తెలియదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.