కిషన్ రెడ్డి టార్గెట్‌గా సొంత నేతల విమర్శలు.. హైకమాండ్ రియాక్షన్ ఇదే!

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితమైంది. అయితే దీనికి కిషన్ రెడ్డిని కారణంగా చూపుతూ ఆయనను సొంత పార్టీ నేతలే మారు పేర్లతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.

Update: 2023-12-12 02:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితమైంది. అయితే దీనికి కిషన్ రెడ్డిని కారణంగా చూపుతూ ఆయనను సొంత పార్టీ నేతలే మారు పేర్లతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. కాగా, కిషన్ రెడ్డి డీగ్రేడ్ చేస్తూ పోస్టులు పెట్టడంపై ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. ట్రోలింగ్ అంశాన్ని ఎలా కట్టడి చేయాలనే దానిపై సీరియస్ గా చర్చిస్తున్నారు.

నెగెటివ్ ప్రచారాన్ని అరికట్టేలా..

తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారాన్ని కిషన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రచారాన్ని అడ్డుకునేలా స్పోక్స్ పర్సన్స్ సమావేశంలో పలు సూచనలు చేసినట్లు తెలిసింది. పార్టీని డ్యామేజ్ చేసే పోస్టులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కౌంటర్ అటాక్ చేసేలా పోస్టులు పెట్టాలని సూచించినట్లు సమాచారం. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలకు సైతం ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. దీన్ని హైకమాండ్ కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. పార్టీని ప్రమోట్ చేసేలా కాకుండా.. నెగెటివ్ ట్రోలింగ్ చేయడంపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

ఆధిపత్య పోరు నేపథ్యంలో..

తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు సొంతంగా సోషల్ మీడియా టీమ్ లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతల ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్న అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. దీన్ని కట్టడి చేయడంపై దృష్టి సారించినట్లు సమాచారం. త్వరలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని హై కమాండ్ భావిస్తున్నది. అందుకుగాను ఇలా చేస్తున్నదెవరనే అంశంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే నివేదికను సిద్ధం చేసినట్లు టాక్. కాగా, అందులో నేతల మధ్య ఆధిపత్య పోరే.. నెగెటివ్ ట్రోల్స్ కు కారణమని అంచనాకు వచ్చినట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీజేపీ హైకమాండ్ ఈ నెగెటివ్ ప్రచారాన్ని ఎలా కట్టడి చేస్తుందనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News