మంత్రి పొంగులేటిని కలిసిన ట్రెసా బృందం.. కారణమిదే!
రెవెన్యూ శాఖలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ట్రెసా ప్రతినిధుల బృందం కోరింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ట్రెసా ప్రతినిధుల బృందం కోరింది. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, కార్యదర్శి కే.గౌతమ్ నేతృత్వంలో నాయకులు గురువారం మంత్రిని కలిశారు.
ప్రధానంగా 61 సంవత్సరాల పై బడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు, విద్యార్హతల్లో వ్యత్యాసాలు, వివిధ శాఖలకు అలాట్మెంట్ జరిగి ఇంకా పోస్టింగ్ ఇవ్వని అంశాలు, అలాగే 55 సంవత్సరాల నుండి 61 మధ్య ఉన్న వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, ఇతర శాఖలకు బదలాయించిన వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని కోరారు.
తిరిగి అదే జూనియర్ అసిస్టెంట్/రికార్డ్ అసిస్టెంట్ కేడర్లో తీసుకోవాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి వీఆర్ఏల సమస్యలన్నీ త్వరలో అంశాలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు దాదేమియా తదితరులు పాల్గొన్నారు.