డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ట్రెసా కీలక రిక్వెస్ట్

రెవెన్యూ శాఖలో ఏడాది నుంచి పెండింగులో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల వెహికల్ బిల్స్, మెడికల్ బిల్స్, జీపీఎఫ్ బిల్స్, సప్లిమెంటరీ సాలరీ బిల్స్ మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టెస్రా బృందం కోరింది.

Update: 2024-01-24 13:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖలో గత సంవత్సర కాలం నుంచి పెండింగులో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల వెహికల్ బిల్స్, మెడికల్ బిల్స్, జీపీఎఫ్ బిల్స్, సప్లిమెంటరీ సాలరీ బిల్స్ మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ బృందం కోరింది. అలాగే వీఆర్ఏల వేతనాల బిల్లులు, కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలు/డివిజన్ల ఉద్యోగులకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బుధవారం ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్ నేతృత్వంలోని బృందం మంత్రిని కలిశారు.

అలాగే క్షేత్ర స్థాయిలో సరిపడా సిబ్బంది లేక రెవెన్యూ సేవలు ప్రజలకు అందించడంలో ఇబ్బందులు కల్గుతున్నాయన్నారు. రెవెన్యూ విధులను, పని భారాన్ని బట్టి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రెవెన్యూ సేవలు సత్వరం అందించేందుకు క్షేత్ర స్థాయి రెవెన్యూ సిబ్బందిని పెంచాలని కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి పెండింగ్ బిల్స్ మంజూరు అయ్యేందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో మరో సారి ట్రెసా ప్రతినిధులతో అన్ని విషయాలు కూలంకుశంగా చర్చించి రెవెన్యూ సిబ్బంది పెంపు అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ లతో పాటు ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి పాల్గొన్నారు.


Similar News