బ్యాంకింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో ట్రైనింగ్ ప్రోగ్రాం: మంత్రి శ్రీధర్ బాబు

స్టేట్ ఫ్యూచర్ టార్గెట్ వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అని, సీఎం సంకల్పం కూడా అదేనని, ఎంఎస్ఎంఈల సహకారంతో సాధిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Update: 2024-09-18 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్టేట్ ఫ్యూచర్ టార్గెట్ వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అని, సీఎం సంకల్పం కూడా అదేనని, ఎంఎస్ఎంఈల సహకారంతో సాధిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దేశంగా చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. తక్కువ సమయంలో ఎంఎస్ఎంఈల కోసం సమగ్ర విధానం రూపొందించాం... అందరూ భాగస్వామ్యంతో ముందుకు పోదాం... మొదటి అడుగు వేశాం... అందరి సహకారంతో రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకుందామన్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఎంఎస్ఎంఈ -2024 నూతన పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఎంఎస్ఎంఈల పాలసీని విడుదల చేశామన్నారు. రాబోయే కాలంలో ఎంఎస్ఎంఈల్లో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. ఎంఎస్ఎంఈని కాపాడుకుంటామని, పెద్ద స్థాయిలో ఉపాధి కల్పిస్తున్న రంగం అన్నారు. తెలంగాణ వైపు అన్ని దేశాలు చూడాలన్నదే తమ లక్ష్యం అన్నారు. 120 మంది ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని నూతన పాలసీని ఆవిష్కరించామన్నారు.

ఈ పాలసీతో ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు సమూలిత మార్పులు తీసుకు రాబోతున్నామన్నారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ విధానం అని, అందుకోసం ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పెరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను టాటా సహకారంతో అప్ గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. 2400 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, పాలిటెక్నికల్ లో కూడా ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కు సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాం చేయబోతున్నామన్నారు. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక పార్కులు, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆ పార్క్ లో 5శాతం ప్లాట్లు మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు 15 శాతం ప్లాట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలను కోటీశ్వర్లును చేయాలని అన్ని వసతులతో ప్లాట్ ప్యాక్టరీస్ ఏర్పాటు చేస్తామన్నారు. స్వయం సహాయ సంఘాల సభ్యులను ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహిస్తామని, క్లస్టర్ల చుట్టూ 10 కామన్ ఫెసిలిటీ సెంటర్లను పెడతామని, ఇండస్ట్రీయల్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎగుమతులు చేసేలా ప్రోత్సహిస్తామన్నారు. సోషల్ ఇన్ ఫ్రా క్లస్టర్లను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. సబ్సిడీలను పెంచామని, అమ్మకాలను సులభతరం చేసేలా, రుణం పొందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్కిల్ క్యాపిటల్ గా చేసేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి రూపకల్పన చేశామన్నారు. ఇండస్ర్టీ 4.0 కు మార్గదర్శకాలు రూపొందించామన్నారు. ఎంఎస్ఎంఈలు తయారు చేసిన వస్తువులను అన్ని శాఖలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. టెండర్ దరఖాస్తులకు రుసుము లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈల బలోపేతానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భూ కొనుగోలుకే ఎంఎస్ఎంఈలు ఆదాయం అంతా వెచ్చించాల్సి వస్తుండటంతో వారికోసం లీజు పాలసీని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం చూసే ఫాక్స్ కాన్ సంస్థలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయన్నారు.


Similar News