దిశ, చెన్నూర్: చెన్నూరు పట్టణానికి చెందిన బొల్లంపల్లి శ్రీనివాస్ మరియు అతని భార్య శశిదేవి విద్యుత్ షాక్ తగిలి మృత్యువాత పడడంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం ఉదయం కరెంటు మోటార్ వేసి ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో శశిదేవికి కరెంట్ షాక్ తగిలింది. ఒక్కసారిగా ఆమె కుప్పకూలింది. ఆ సమయంలో బిగ్గరగా అరవడంతో ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త శ్రీనివాస్ భార్యను తాకడంతో అతడు కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు.
దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే సారి భార్యభర్తలు చనిపోవడంతో పట్టణంలో విషాదం నెలకొంది. అందరిని మృతుడు శ్రీనివాస్ అన్న, తమ్ముడు అని ఆప్యాయతగా పిలిచేవాడు. పట్టణంలో బంగారు దుకాణం వ్యాపారం నిర్వహిస్తుండటంతో పాటు స్వర్ణకారుల వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. అతని మృతికి సంతాపంగా స్వర్ణకారులు దుకాణాలు బంద్ చేశారు.