ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదా.. వీధి కుక్కలు తింటుంటే ఏం చేస్తున్నారు?

చిన్నారులు, వృద్ధులను వీధి కుక్కలు దాడులు చేస్తుంటే, సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫైర్ అయ్యారు.

Update: 2024-08-10 13:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చిన్నారులు, వృద్ధులను వీధి కుక్కలు దాడులు చేస్తుంటే, సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదా? అంటూ ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...గత కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా కుక్కలు దాడులు జరుగుతున్నాయని, గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ వీధి కుక్కల దాడిలో పసికందులు, వృద్ధులు మరణించిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే తాను దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కు కూడా లెటర్లు ఇచ్చానన్నారు. స్వయంగా హైకోర్టు సుమోటోగా తీసుకొని వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం అన్నారు.

జూలై 12 ఇబ్రహీంపూర్ లో లో ఓ బాలుడిని కుక్క దాడి చేయగా, నిలోఫర్ లో చికిత్స తీసుకుంటూ మరణించాడని గుర్తు చేశారు. అంతేగాక నార్సింగ్ పరిధిలో ఓ వికలాంగుడి బాలుడిని కుక్క దాడి చేసిందన్నారు. ఆగస్టు 1న బాలాపూర్ లో ఏకంగా 21 మంది చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండలం లో 75 ఏళ్ల వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి చేసి ఏకంగా ఆమె పొట్టను తీనేశాయన్నారు. ఇంత బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నా, ఇటు స్టేట్, అటు జీహెచ్ఎంసీ అధికారులు కనీసం పట్టించుకునే చర్యలు కూడా తీసుకోవడం లేదని మండిపడ్డారు. దీని వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందన్నారు.

ఒక్క ఎమ్మెల్యే నోరు విప్పరా..?

ఇక గత కొన్ని రోజుల నుంచి వీధి కుక్కల దాడులు జరుగుతుంటే, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఈ అంశంపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే చట్ట సభల్లో సభ్యులుగా ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటే సరిపోతుందా? అంటూ చురకలు అంటించారు. తాజాగా ఎంజీఎం ఆసుపత్రి సమీపంలో ఓ పసికందును కుక్కలు తినడం శోచనీయమన్నారు. ఇంత జరుగుతున్నా, అధికారులు, అక్కడ సెక్యూరిటీ స్టాఫ్​ ఏం చేస్తున్నారని? ప్రశ్నించారు. అసలు కుక్కలు ఆసుపత్రికి ఎలా వచ్చాయి? అని మండిపడ్డారు. ఇదే అంశంపై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ కు లేఖ రాశానని, ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని సూచించానన్నారు.

టెక్నాలజీ లేదా..?

గూగుల్ మ్యాపింగ్ చేసి ఇళ్లు గుర్తించి ట్యాక్స్ లు కట్టిస్తామని చెబుతున్న మున్సిపల్, జీహెచ్ఎంసీ అధికారులు, అదే టెక్నాలజీ ని వినియోగించి కుక్కల విచ్చలవిడి తనాన్ని, దాడులను అరికట్టలేరా? అంటూ నిరంజన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు రోడ్డు యాక్సిడెంట్లు కూడా భారీగా పెరిగాయన్నారు. డైలీ టీవీల్లో ఈ రెండు సంఘటనలే కనిపిస్తున్నాయననారు. ఓవర్ స్పీడ్ ను నియంత్రించడంలో అధికారులు వైఫల్యం చెందారన్నారు. అధికారులు నిర్లక్ష్యం ప్రభుత్వంపై పడుతుందని గుర్తు చేశారు. కుక్కల దాడుల్లో మరణించిన శిశువు కుటుంబాలకు వెంటనే ఆయా స్థానిక సంస్థల నుంచి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన బాధితులకు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.

Tags:    

Similar News