కేసీఆర్ ఫ్యామిలీకి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూం.. అందరూ అక్కడికే షిఫ్ట్ : రేవంత్ రెడ్డి

తొమ్మిదేళ్ళ పాటు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్‌కు జైలు శిక్ష తప్పదని, ఆ ఫ్యామిలీ మొత్తం చర్లపల్లి జైలుకెళ్ళడం ఖాయమని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Update: 2023-06-09 10:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తొమ్మిదేళ్ళ పాటు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్‌కు జైలు శిక్ష తప్పదని, ఆ ఫ్యామిలీ మొత్తం చర్లపల్లి జైలుకెళ్ళడం ఖాయమని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చర్లపల్లి జైల్లో కేసీఆర్ ఫ్యామిలీకి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టిస్తామని, అందులో కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ఉండొచ్చని రేవంత్ కామెంట్ చేశారు. నిజాం కాలంనాటి భూములన్నింటినీ కబ్జా చేయడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని, దోచుకోడానికే ఆ విధానాన్ని ఎంచుకున్నారని ఆరోపించారు. ధరణి సర్కారు చెప్పుచేతల్లో నడవడంలేదని, దళారీల చేతుల్లోకి పోయిందన్నారు. యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎంత ఏడ్చి గోలపెట్టినా కేసీఆర్, కేటీఆర్‌ను వదిలేది లేదన్నారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజ్‌గిరి జిల్లాల్లో భూ అవకతవకలు భారీ స్థాయిలో జరిగాయని, అధికారులను జైలు ఊచలు లెక్కిపెట్టిస్తామన్నారు. బరాబర్ ధరణిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి పేరుతో వేలాది ఎకరాలను కేసీఆర్, కేటీఆర్ తన బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు.

ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన సమాచారం దళారుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ధరణి రాకముందు రైతు బంధు రాలేదా అని ప్రశ్నించిన రేవంత్... ఆ పోర్టల్‌ను ప్రారంభించిన ఊరిలోనే భూముల రికార్డులు లేవన్నారు. ధరణిని విమర్శిస్తే కేసీఆర్‌కు ఎందుకంత దుఃఖం వస్తుందని ప్రశ్నించారు. తండ్రీ కొడుకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ధైర్యంగా తన పేరును ఉచ్ఛరించడానికి కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. గడీల పాలన నుంచి ప్రజలకు తొందర్లోనే విముక్తి రాబోతున్నదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఇకపైన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారా మంచి పాలన అందబోతున్నదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా దేశమంతా పార్టీ శ్రేణులు కష్టపడాలన్నారు. దేశ భవిష్యత్తును మార్చడానికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వారి సత్తాను చాటాలన్నారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్‌లను గద్దె దించడానికి యూత్ కాంగ్రెస్ మరింత యాక్టివ్‌గా పనిచేయాలన్నారు.

కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, మంత్రులు కేటీఆర్, హరీష్ సిద్ధమేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేయనిది ఏదైనా బీఆర్ఎస్ చేసి ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తండ్రీ కొడుకులు నిప్పు తొక్కిన కోతిలా ఎగురుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ లాగా తాము రాష్ట్రాన్ని కొల్లగొట్టలేదని, దోపిడీలు చేయలేదని అన్నారు. కేసీఆర్‌కు బుద్ది, జ్ఞానం ఉంటే ఉద్యమకారులను పువ్వుల్లో పెట్టి చూసుకునేవారని అన్నారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగిందన్నారు. ప్రజలు ఎవరిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారో త్వరలోనే తెలుస్తుందన్నారు.

కేసీఆర్ రద్దైన వెయ్యి నోటులాంటివాడన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే దొంగల పాలన నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. తెలంగాణకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నదన్నారు. కర్ణాటక ఫలితాలు ఇక్కడా రిపీట్ అవుతాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినాన్ని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించి ఐదు అంశాలతో ప్రజల్లోకి వెళ్తామని, సెప్టెంబర్ 17న మేనిఫెస్టో విడుదలకు పార్టీ పెద్దలతో చర్చిస్తున్నామన్నారు.


Similar News