ధరణి అక్రమాలు ఆధారాలతో బయటపెడతా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
“ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోంది. కానీ, దీని వెనక పెద్ద మాఫియా దాగుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: “ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోంది. కానీ, దీని వెనక పెద్ద మాఫియా దాగుంది. అందుకు సంబంధించి ధరణి ఫైల్స్‌ను ఆధారాలతో సహా సీరియల్‌గా బయటపెడతాం. దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్న” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణి రూపేణా ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయని ఆయన ఆరోపించారు. గురువారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. “ధరణి పోర్టల్‌లో బ్రిటిష్ ఐల్యాండ్‌కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయి. ధరణి మొత్తం యువరాజు మిత్రుడు గాదె శ్రీధర్ రాజు చేతుల్లో ఉంది. దారిదోపిడీ దొంగలకంటే భయంకరమైన దోపిడీ జరుగుతోంది. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయి. అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అందరి వివరాలు విదేశీయుల గుప్పిట్లో ఉన్నాయి.. ఇది అత్యంత ప్రమాదకరం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘‘ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు ఆర్థిక నేరగాళ్లు. ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న వారిలో విదేశీయులు ఉన్నారు. ధరణి పోర్టల్ ఏ దేశ పౌరుడి చేతిలో ఉందో, అతడు ఎలాంటివాడో, దావూద్ ఇబ్రహీం కంటే పెద్ద మాఫియా నాయకుడో, ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అమ్ముకునే డ్రగ్ లార్డో మనకు తెలియదు. ఈ పోర్టల్ ద్వారా మన వివరాలన్నీ విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నాయి. అనేక చేతులు మారి చివరకు.. ధరణి పోర్టల్ బ్రిటిష్ ఐల్యాండ్ చేతికి వెళ్లింది. ధరణిలోని అనేక లోటుపాట్లను ఆసరాగా తీసుకొని నిషేధిత జాబితాలోని భూములను అనుచరులకు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములను అనుచరులకు రిజిస్ట్రేషన్ చేసి వెంటనే ప్రొహిబిషన్ లాక్ చేస్తున్నారు. ధరణి పోర్టల్ మొత్తం కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ గాదె చేతిలో ఉంది. శ్రీధర్ గాదె వద్ద ఉన్న తాళంతో ధరణిని ఎప్పుడైనా తెరవొచ్చు, ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీద మార్చేయొచ్చు’’ అని రేవంత్ వివరించారు. ప్రభుత్వ భూములకు యజమానులను సృష్టించడం, అనంతరం ఆ భూములను బదలాయించడం, ఆ తర్వాత వాటిని లే అవుట్లు వేసి అమ్ముకోవడం.. ఈ తతంగం ఇలా నడుస్తోందని రేవంత్ వెల్లడించారు. ధరణి పోర్టల్ సాయంతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని అన్నారు.
కాంగ్రెస్ భూ డిక్లరేషన్ అంశాలు ఇవే...
1.ధరణిలో తప్పుల వలన లక్షల మంది రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ -వ్యవస్థను రద్దు చేసి దీని స్థానంలో భూమి వాస్తవ పరిస్థితికి అద్దంపట్టి, తప్పులు లేని, అందరికీ అందుబాటులో ఉండే కొత్త కంప్యూటర్ రికార్డును రూపొందిస్తాం. ఇప్పుడున్న రికార్డు సమస్యలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కరిస్తాం.
2. నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా తొలగిస్తాం.
3. అన్ని రకాల భూముల సమగ్ర సర్వే చేసి కొత్త రికార్డులు రూపొందిస్తాం. వ్యవసాయ భూములకు, ఇంటి స్థలాలకు కొత్త పట్టాలు ఇస్తాం. భద్రమైన హక్కులు కల్పిస్తాం.
4. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగే తొలి శాసన సభా సమావేశంలోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా మేరకు టైటిల్ గ్యారంటీ చట్టం చేసి ప్రభుత్వమే భూమి హక్కులకు పూర్తి హామీ ఇచ్చే వ్యవస్థను తెస్తాం.
5. వందకు పైగా ఉన్న భూచట్టాల స్థానంలో ఒకే భూమి చట్టం తెస్తాం.
6. కౌలుదారులకు రుణ అర్హత కార్డులు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తాం.
7. కాంగ్రెస్ తెచ్చిన భూ సంస్కరణల ద్వారా ఇప్పటి వరకు పేదలకు పంచిన పాతిక లక్షల ఎకరాల భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తాం.
8. 2006లో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులందరికీ పోడు భూములకు పట్టాలు ఇస్తాం.
9. కేంద్రంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని యధాతథంగా అమలు చేస్తాం. రైతుల అనుమతి లేకుండా భూములు సేకరించం. అసైన్డ్ భూములకు, పోడు భూములకు కూడా పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం చెల్లిస్తాం. ఇప్పటి వరకు అలా నష్ట పరిహారం రాని వారికి న్యాయం చెయ్యడానికి రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేస్తాం.
10. భూపరిపాలన వ్యవస్థను బలోపేతం చేస్తాం. గ్రామ నుండి రాష్ట్ర స్థాయి వరకు సిబ్బందిని నియమించి రైతులకు హక్కుల చిక్కులు లేకుండా చేస్తాం.
11. భూ సమస్యల పరిష్కారానికి జిల్లాకొక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం.