ప్రమాణస్వీకారం రోజే ఉద్యోగం.. TPCC చీఫ్ రేవంత్ రెడ్డి కీలక హామీ

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన సిక్స్ గ్యారంటీస్‌లో ఒకటిగా ఉన్న అభయహస్తం స్కీమ్ కింద తొలి రోజునే ఉద్యోగం ఇస్తామని దివ్యాంగురాలికి పీసీసీ చీఫ్ రేవంత్ హామీ ఇచ్చారు.

Update: 2023-10-17 10:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన సిక్స్ గ్యారంటీస్‌లో ఒకటిగా ఉన్న అభయహస్తం స్కీమ్ కింద తొలి రోజునే ఉద్యోగం ఇస్తామని దివ్యాంగురాలికి పీసీసీ చీఫ్ రేవంత్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కచ్చితంగా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు. గన్‌పార్కు దగ్గర పోలీసులు అరెస్టు చేసిన అనంతరం గాంధీ భవన్‌కు చేరుకున్న రేవంత్.. నాంపల్లికి చెందిన రజనీ అనే దివ్యంగురాలి (మరుగుజ్జు)కి అభయహస్తం ద్వారా సాయం చేయడానికి సంబంధించిన కార్డును, పత్రాన్ని అందజేశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సోనియాగాంధీ సహా రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని, అదే వేదిక మీద ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తూ అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వనున్నట్లు రజనీకి భరోసా కల్పించారు.

పీజీ పూర్తిచేసినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదని, ప్రైవేటు సంస్థలు కూడా ఆసక్తి చూపలేదని రేవంత్‌రెడ్డికి రజనీ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ఇది “రేవంత్‌రెడ్డిగా నేను ఇస్తున్న హామీ” అని భరోసా ఇచ్చారు. సిక్స్ గ్యారంటీలో అభయహస్తం స్కీమ్ కింద ఆమెకు గ్యారంటీ కార్డును అందజేశారు.

Tags:    

Similar News