పర్యాటకులకు మొండిచేయి
అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులకు నిరాశే ఎదురవుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో :అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులకు నిరాశే ఎదురవుతోంది. విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు అనుమతిని నిరాకరిస్తున్నారు. పలుజిల్లాల నుంచి తిలకించేందుకు వస్తున్నవారు విగ్రహాన్ని తాకకుండానే వెనుదిరగాల్సి వస్తుంది. గేట్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. చేసేదేమీలేక అక్కడి నుంచే సెల్ఫీలు తీసుకుంటున్నారు. పనులు కంప్లీట్ కాలేదంటూ అక్కడ ఉన్న సిబ్బంది సమాధానం ఇస్తుండటం గమనార్హం.
దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈనెల 14న అంబేద్కర్ జయంతి రోజున సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 11.4 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహంతో పాటు అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహంపై విస్తృత ప్రచారం చేశారు. అయితే విగ్రహాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని జిల్లాల నుంచే కాకుండా, ఏపీ, కర్నాటక, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు వస్తున్నారు. అయితే వారికి నిరాశే ఎదురవుతుంది. ఆశతో వందల కిలోమీటర్లదూరం నుంచి వచ్చినవారు దూరం నుంచే చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పనులు ఇంకా పూర్తికాలేదని, అందుకే ప్రవేశం లేదని అక్కడ ఉన్న సిబ్బంది నిరాకరిస్తున్నారు. గేట్లకు తాళాలు వేశారు... చేసేదేమీలేక గేటు దగ్గరనుంచి, రోడ్డుపై నిలబడి ఫొటోలు దిగుతున్నారు. ఇంకా పనుల పూర్తికి నెలకు పైగా పట్టే అవకాశం ఉందని సిబ్బంది పేర్కొంటున్నారు.
అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం కావడంతో ఒకసారైనా తాకాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అదే తపనతో వందలాదిగా చూసేందుకు వస్తున్నారు. అంతేగాకుండా అంబేద్కర్ జీవిత చరిత్రను తెలిపే ఫొటోల ప్రదర్శన, థియేటర్, లైబ్రరీ ఉండటంతో కలియ తిరగాలని ఫొటో దిగాలని భావిస్తున్నారు. అంబేద్కర్ చిన్నతనం నుంచి దిగిఫొటోలు ఎలా ఉన్నాయి... చరిత్ర తెలిపే పుస్తకాలు ఏమున్నాయి... ఇంకా ఏం ఏర్పాటు చేశారో చూద్దామని తరలివస్తున్నారు. కానీ ప్రవేశం లేకపోవడంతో నిరాశే ఎదురవుతుంది.
భారత రాజ్యాంగ నిర్మాతను దగ్గరనుంచి చూసే అవకాశం ఒక్కరోజూ మాత్రమే లభించింది. అంబేద్కర్ జయంతి రోజున విగ్రహాన్ని ప్రారంభించడంతో ఆరోజు వచ్చినవారికి మాత్రమే ఆ సదవకాశం వచ్చింది. విగ్రహం పనులన్ని కంప్లీట్ అయిన తర్వాతే ఆవిష్కరించకుండా ముందుగానే ప్రారంభించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతోనే ఆర్భాటంగా ప్రారంభించి లబద్దిపొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పర్యాటకుల సందర్శనకు మాత్రం కాదని పెదవి విరుస్తున్నారు.
ఇదిలా ఉంటే అంబేద్కర్ స్మృతి వనంను ఎవరు మెయింటెన్స్ చేయాలనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. జీహెచ్ఎంసీకి అప్పగించాలా? ఎస్సీ కార్పొరేషన్ ను అప్పగించాలా? అనే దానిపై కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పర్యాటకులకు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారో అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. వీడియో విజువల్ తో కేవలం అంబేద్కర్ జీవిత చరిత్రకు తెలిపే సినిమా వేస్తారా? అందుకు టికెట్ ఏమైనా నిర్ణయిస్తారా? స్మృతి వనం ఎంట్రీకి టికెట్ ఉంటుందా? విగ్రహం పర్యవేక్షణ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారా? ఎప్పటి నుంచి పర్యాటకులకు ఎంట్రీ కల్పిస్తారు? పర్యటకులకు సందర్శన సమయంలో ఏమైనా నిబంధనలు పెడతారా? అనేదానిపై స్పష్టత రాలేదని సమాచారం. ఏదీఏమైనప్పటికీ అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు వచ్చే వీక్షకులకు మాత్రం నో ఎంట్రీ అనడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎంట్రీ అవకాశం ఇవ్వాలి.. రాజుదంపతులు, కర్నూలు
అంబేద్కర్ విగ్రహం చుద్దామని వచ్చాను. పెద్దవిగ్రహం ఏర్పాటు చేయడంతో దర్శించుకోవాలనే ఆశ ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నో ఎంట్రీ అనడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తుంది. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరితే సిబ్బంది నిరాకరించారు. చేసేదేమి లేక వెళ్లిపోతున్నాం.
ఎందుకు ఆవిష్కరించారు?.. సాయి, షాద్ నగర్
అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్దామంటే గేటుకు తాళం వేశారు. పనులు పూర్తి కాలేదని అందుకే అనుమతి ఇవ్వడం లేదని సిబ్బంది చెప్పారు. పూర్తికాకుండానే ఎందుకు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంతో ఆశతో వస్తే నిరాశ చెందాల్సి వచ్చింది. మహాత్ముడి విగ్రహాన్ని ఎలాగేనా చేసేది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని దర్శించుకునే అవకాశం ఇవ్వాలి.
గేటువద్దే సెల్ఫీ తీసుకున్నా.. భూపాల్, కర్నాటక
అంబేద్కర్ తో ఫొటో దిగాలనే ఆశతో వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఎంట్రీ లేదని చెప్పారు. బ్రతిమలాడాను...దూరం నుంచి వచ్చాను...అవకాశం ఇవ్వాలని కోరితే సిబ్బంది నిరాకరించారు. చేసేదేమీలేక గేటు దగ్గర నుంచే విగ్రహాన్ని చూశాను. ఇక్కడి నుంచే సెల్ఫీ తీసుకున్నా.