ఊరు ఊరంతా విద్యుత్ షాక్.. కొంచెంలో ప్రాణాలతో తప్పించుకున్న గ్రామస్తులు
విద్యుత్ షాక్ తో ఊరు ఊరంతా వణికిపోయింది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఎక్కడైనా ఒక ఇంట్లో కొంత మందికి విద్యుత్ షాక్ సంభవించడం, అలాంటి ఘటనల్లో కొంత మంది ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటాం. కానీ ఏకంగా ఊరు ఊరంతా విద్యుత్ షాక్ తో వణికిపోయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రాజంపేట మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలుగుట్ట తండాలో గురువారం రాత్రి ఒక్కసారిగా తండాలోని అన్ని ఇళ్లలో విద్యుదాఘాతం సంభవించింది. ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానికి వస్తువులను దేన్ని ముట్టుకున్నా షాక్ తగిలింది. దీంతో ఏం జరుగుతుంతో అర్థం కాక గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. భయాందోళనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మండిపడుతూ కొండాపూర్ సబ్ స్టేషన్ను ముట్టడించి నిరసన తెలిపారు. దేవుడి దయతో గ్రామస్తులమంతా క్షేమంగా బయటపడగలిగామని ఒక వేళ ప్రాణనష్టం జరిగిఉంటే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.