మీకు మీ కాంగ్రెస్ పార్టీకో దండం.. ఇక నేను కొనసాగలేను! : సొంత పార్టీపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

మీకు.. మీ కాంగ్రెస్ పార్టీకో దండం.. ఇకనైనా మమ్మల్ని బత్రకనియ్యండంటూ సొంత పార్టీపై మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Update: 2024-10-22 07:46 GMT

దిశ, వెబ్ డెస్క్ :మీకు.. మీ కాంగ్రెస్ పార్టీకో దండం.. ఇకనైనా మమ్మల్ని బత్రకనియ్యండంటూ సొంత పార్టీపై మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇంత కాలం మానసిక అవమానాలకు గురవుతున్నా తట్టుకున్నామని, ఇప్పుడు భౌతికంగా దాడులు చేసి చంపుతున్నారన్నారని.. ఎందుకు భరించాలని.. ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకొనైనా ప్రజలకు సేవ చేస్తానంటూ ప్రభుత్వ విప్ లక్ష్మణ్ తో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగాలంటూ తనకు ఫోన్ చేసిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఎందుకు కొనసాగాలి.. దయచేసి నన్ను క్షమించాలని, నేను పార్టీలో ఉండలేనంటూ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు దశబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వైపు మహేష్ గౌడ్ మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేశారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్యకు గురయ్యారు. జగిత్యాల - జాబితాపూర్ శివారులోకారుతో ఢీకొట్టి కత్తితో 20 పోట్లు పొడిచి చంపారు. గంగారెడ్డి హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సొంత పార్టీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమవుతారన్న ప్రచారానికి ఊతమిస్తోంది. కాగా గంగారెడ్డి హత్యోదంతం వివాదంలో ఆ జిల్లా ఎస్పీ కి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. నిందితులు ఎవరైన కఠినంగా శిక్షించాలని కోరారు. జగిత్యాల నియోజకవర్గంలో బీఆరెఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అనంతరం కాంగ్రెస్ లో చేరగా, ఆయన చేరికను స్థానిక సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి గట్టిగా వ్యతిరేకించారు. ఓ దశలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్దపడగా, కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను ఢిల్లీకి పిలిపించుకుని బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేసింది. అయితే నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురికావడం నియోజకవర్గ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతలను పెంచింది. 


Similar News