ముఖ్యమంత్రికి మూడో కాన్వాయ్.. ఇకపై మరింత కాస్ట్లీగా KCR పర్యటన

ఊపర్ షెర్వానీ.. అందర్ పరేషానీ..ఇదీ తెలంగాణ సర్కారు తీరు. పెన్షన్లు, ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చుల కోసం నానా పాట్లు పడుతున్న సర్కారు సీఎం కేసీఆర్ కోసం ముచ్చటగా మూడో కాన్వాయ్ ని రెడీ చేస్తున్నది.

Update: 2022-09-09 04:08 GMT

"తెలంగాణ వచ్చాక ఒక చిన్న విచిత్రమైన కథ జరిగింది. అంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి గారి కార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాక నాకు వాడకానికి వచ్చాయి. అవన్నీ నల్ల కలర్​ లో ఉండేవి. నాకు బ్లాక్​ కలర్​ నచ్చదు. ఒకాయన ఐజీ సెక్యూరిటీ అని ఉంటడు. ముఖ్యమంత్రి ఎక్కే కార్లు. దిగేకార్లు అన్నీ ఆయన చూస్తడు. నల్ల కార్లు బాగా లేవు కదా అని చెప్తే.. కొత్త కార్లు కొనుక్కుందామన్నడు. కొంచెం ఆగు.. ఇప్పుడే సంసారం మొదలు పెట్టినం. వీటినే తెల్లకార్లు చేయాలే..! అని చెప్పిన. ఏం లేదు సార్లు కలర్​ గీకి తెల్ల కలర్​ వేయడమే అన్నడు. అట్లనే చేయుమన్న.. అంతే షెడ్డుకు తీసుకుపోయి మూడో కంటికి తెల్వకుండా రెండు మూడు రోజుల్లో నల్ల కార్లను తెల్లగామార్చిండు. ఇది ఎట్లనో గవర్నర్​ నర్సింహన్​ గారికి తెలిసింది. ఓ రోజు రాజ్​ భవన్​ కు పోతే.. ఆయన నన్ను పట్టుకుని.. ఏమయ్యా కేసీఆర్​ నువ్వు బాగా పిసినారివి ఉన్నవ్. కలర్ ఎందుకు మార్చినవ్.. కొత్త కార్లు కొనుక్కొపోయినవ్​అని అన్నడు. మాకు భయం అయ్యా.. మాకేం అర్థమైతలేవు. నాలుగైదు నెలలు గడిస్తే మా కథ తెలుస్తది. దాన్ని బట్టి పథకాలు రూపకల్పన చేసుకుంటం. ఆచితూచి అడుగులేస్తున్నం.. అని చెప్పిన. ఇలా అంత జాగ్రత్తగా ప్రతి విషయంలో వ్యవహారం చేసుకుంటూ వచ్చినం కాబట్టి.. అనేక విషయాల్లో దేశంలోనే నంబర్​ వన్​ గా ఉన్నాం.. "ఖర్చులకు సంబంధించిన అంశాలపై ఇలా వివరించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏకంగా మూడు కాన్వాయ్ లను మెయింటేన్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇది వరకే రెండు కాన్వాయ్ లు ఉండగా తాజాగా మరోటి ఏపీలోని కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో రెడీ అవుతున్నది. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు ధనిక రాష్ట్రం!

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇతర రాష్ట్రాలకు వెళ్తే అక్కడి ప్రభుత్వం ప్రొటోకాల్​ ప్రకారం ఏర్పాట్లుంటాయి. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ...! ఆ రాష్ట్ర సీఎంది ప్రత్యేకంగా ఉండొద్దా..? అందుకే స్పెషల్​ కేటగిరి. ఇటీవల జాతీయ రాజకీయాలు, యాంటీ బీజేపీ అంటూ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు సీఎం కేసీఆర్. గల్వాన్​​ సైనిక అమరవీరులకు ఆర్థిక సాయం పేరుతో ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నారు. అక్కడ రాజకీయాలు సైతం మాట్లాడుతున్నారు. ఇలా ఏ రాష్ట్రానికి వెళ్లినా సీఎం కేసీఆర్​ హెలికాప్టర్​ లేదా స్పెషల్​ ఫ్లైట్​ లో వెళ్తారు. కానీ, అంతకు ముందు రోజే తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్​ కోసం ఆ రాష్ట్రంలో కూడా మన కాన్వాయ్ వాలిపోతుంది. ఇతర రాష్ట్రాల్లో పర్యటన కోసం 10 టయోటా ఫార్చూనర్ కార్లను కొన్నారు. ఇందులో ఆరు నుంచి 8 కార్లను ఇతర రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు సీఎంతో పాటుగా ఉంటాయి. ఇలా ఏ రాష్ట్రానికి వెళ్లినా సీఎం సొంత వాహనశ్రేణి అక్కడకు వెళ్తుంది. గతంలో అమెరికా అధ్యక్షుడు ఇండియా వస్తే ఆయనకు సొంత వాహన శ్రేణిని ప్రత్యేక విమానాల్లో తెచ్చిన విషయం తెలిసిందే..! ప్రధాని టూర్​ ఏ రాష్ట్రంలో ఉన్నా.. అక్కడికి పీఎం స్పెషల్ కాన్వయ్ వెళ్తుంది.. ప్రత్యేక వాహనాలు వెళ్లడం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ఏ స్టేట్​ కు వెళ్లినా తెలంగాణ వాహనాలు అక్కడి రోడ్లపై పరుగులు తీయనున్నాయి.

సిద్ధమైన కొత్త కాన్వాయ్

సీఎం కేసీఆర్​ కోసం 8 ల్యాండ్​ క్రూయిజర్స్​ ఫ్రాడో, 10 ఫార్చూనర్​ లు సిద్ధమైనట్లు భద్రతా అధికారులు ఆఫ్​ ది రికార్డుగా చెప్తున్నారు. ఒకేసారి వీటిని తీసుకువస్తున్నా.. వినియోగించడంలో మాత్రం విడుతల వారీ పద్దతిని అవలంబించనున్నారు. పాత కార్లను బయటికి తీస్తూనే.. వాటిలో కొత్త కార్లను సైతం వాడనున్నారు.

మూడు బస్సులు

రాష్ట్రంలోని జిల్లాల టూర్లకు సీఎం కేసీఆర్​ బస్సును వినియోగిస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్​ లో వెళ్తే ఆ ప్రాంతానికి ముందుగా సీఎం కాన్వాయి వాహనాలు, స్పెషల్​ బస్​ వెళ్తున్నది. ఈ బస్​ ఉండగానే.. మరో రెండు వొల్వో బస్సులను సైతం కొన్నారు. ఇవి కూడా రెడీ అవుతున్నాయి.

హెలికాప్టర్ ​కంటిన్యూ

రాష్ట్ర ప్రభుత్వం ఏడున్నరేండ్ల కిందట ఒక హెలికాప్టర్​ ను అద్దెకు తీసుకున్నది. అంతకు ముందు ప్రభుత్వానికి సొంత హెలికాప్టర్​ ఉండగా, 2‌‌009లో అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి అదే హెలికాప్టర్​ లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాంతో కొత్త హెలికాప్టర్​ కొనుగోలు చేయలేదు. స్వరాష్ట్రం వచ్చాక హెలికాప్టర్​ వద్దనుకున్నా.. ఏడాదిలోనే నెలకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు చెల్లిస్తూ ప్రభుత్వం అద్దెకు తీసుకున్నది. దానికి ముంబైలో పార్కింగ్​, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చే ఖర్చు, ఇక్కడ పార్కింగ్​ ఖర్చు, ఇంధనం, పైలట్​, అసిస్టెంట్​ పైలట్​, నిర్వహణ ఖర్చులు, వారి బస తదితర ఖర్చులను సర్కారు భరిస్తున్నది.

తెలంగాణ ఏర్పడే నాటికి : 7 ఫార్చూనర్లు

2015లో కొనగోలు చేసినవి: 5 ల్యాండ్ క్రుయిజర్లు

2022లో రెడీ అవుతున్నవి: 8 ల్యాండ్ క్రుయిజర్స్ ఫ్రాడో

10 టయోటా టాప్ మోడల్ ఫార్చూనర్లు

02 వోల్వో బస్సులు

ఇవి కాకుండా...!

హరితహారం ప్రారంభం సందర్భంగా వోల్వో బస్సు

8ఏండ్ల నుంచి నెలకు రూ. 4 కోట్ల నుంచి 5 కోట్ల అద్దెపై హెలికాప్టర్

(నిర్వహణ ఖర్చులు అదనం)

Also Read : ప్రస్తుతం ఉన్న కాన్వాయ్ ల సంఖ్య : మూడు

కాన్వాయ్ 1: షెడ్డుకే పరిమితం (ప్రతినెలా మరమ్మతులు, నిర్వహణ ఖర్చులుంటాయి)

కాన్వాయ్ 2: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు వినియోగిస్తారు

కాన్వాయ్ 3: (న్యూ) ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు వాడుకుంటారు. 

సీఎం టూర్ ఎఫెక్ట్.. వీఆర్‌కు పట్టన సీఐ, మూడవ టౌన్ ఎస్ఐ 

Also Read : 'టీఆర్ఎస్ గొర్రెలు మహిళలను గౌరవించడం లేదు' 

ఇవి కూడా చ‌ద‌వండి : 

CM KCR జాతీయ పార్టీ ప్రకటన వేదిక ఖరారు

Also Read : దీదీ నన్ను సైలెంట్‌గా ఉండమన్నారు.. లేకపోతేనా..? 

Tags:    

Similar News