కేసీఆర్‌ను గద్దె దించేందుకే కొత్త నినాదం!

కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు.

Update: 2023-05-18 12:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు. ప్రజలంతా కొట్లాడి తెలంగాణను సాధించుకుంటే కేసీఆర్ కుటుంబం ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని దోచుకుంటుందని, ఈ దోపిడీని అడ్డుకోకుంటే తెలంగాణ సమస్యలు పరిష్కారం కావన్నారు. జూన్ 4వ తేదీన సూర్యాపేటలో జరగబోయే తెలంగాణ జన సమితి 3వ ప్లీనరీ పోస్టర్, కరపత్రాన్ని గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరామ్.. విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు ఏ వర్గానికి కేసీఆర్ న్యాయం చేయలేకపోయారని ధ్వజమెత్తారు.

నాడు రాష్ట్ర సాధన కోసం ‘జై తెలంగాణ’ అని నినదిస్తే ఇవాళ ఈ పాలకుల నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు తెలంగాణ బచావ్ అనేది నినాదంగా మారిందన్నారు. కరోనా కారణంగా రెండు ప్లీనరీలను జరుపుకోలేకపోయామని ఉద్యమ కారుల ఆకాంక్షల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనేక ప్రజా సమస్యలపై ఇప్పటి వరకు పోరాడామని రాబోయేది ఎన్నికల ఏడాది కావడంతో భవిష్యత్ కార్యచరణపై దృష్టి సారిస్తామన్నారు. కేసీఆర్ రైతు రాజ్యం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఉద్యోగులను సంఘటితం చేసి వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

Also Read..

నలుగురు ముఖ్య నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

Tags:    

Similar News

టైగర్స్ @ 42..