ముగ్గురు.. మూడు వైపులా.. విపక్షాలకు షాక్ ఇచ్చేలా BRS వ్యూహం!

విపక్షాలు ఎన్నికలకు సన్నద్ధం కాకముందే మొదటి దఫా ప్రచారం పూర్తి చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.

Update: 2023-10-12 02:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విపక్షాలు ఎన్నికలకు సన్నద్ధం కాకముందే మొదటి దఫా ప్రచారం పూర్తి చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. నామినేషన్ల ప్రక్రియ పూర్తికాకముందే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేలా ప్లాన్ వేసింది. అందులో భాగంగా ఇప్పటికే సీఎం కేసీఆర్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కేవలం 17 రోజుల్లో మూడొంతుల నియోజకవర్గాల్లో ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు కేటీఆర్, హరీశ్ రావు సభలకూ ప్లాన్ చేసింది. చేశారు. రాష్ట్రంలోని నలుమూలల విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టింది.

సీఎం కేసీఆర్ 41 సభలు

అందరి కంటే ముందుగా సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి వారు నియోజకవర్గాల్లో ఉండేలా చూసుకున్నారు. మరోవైపు గతానికి భిన్నంగా ఈ సారి సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌ను రూపొందించారు. మొదటి విడత 41 సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తికాక ముందే కేవలం 17 రోజుల్లోనే వీటిని కంప్లీట్ చేయాలని కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. పోటీచేయాలని భావిస్తున్న మరికొన్ని పార్టీలు సైతం అభ్యర్థుల వేటలోనే ఉన్నాయి. అయితే ఆ పార్టీలంతా ప్రచారం ప్రారంభించకముందే మొదటి దఫా ప్రచారాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

కేటీఆర్, హరీశ్ రావు సభలకు ప్లాన్

సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సభలకూ పార్టీ ప్లాన్ చేస్తున్నది. ఇద్దరు 50కి పైగా సభల్లో పాల్గొనేలా కార్యాచరణ రూపొందిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్లు, వారి పాలనలో తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరించేందుకు ఇద్దరు మంత్రులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీల నాయకులు చేస్తున్న ప్రచారాలను మంత్రులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. ఒకవైపు కేసీఆర్... మరోవైపు మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు విస్తృతంగా పర్యటించేలా ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా..

సోషల్ మీడియా వేదికగానూ బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తొమ్మిదేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా చేసిన అభివృద్ధిని లెక్కలతో సహ చెబుతున్నది. అంతేకాదు ఎంతమంది ప్రభుత్వ పథకాలతో లబ్దిపొందారో గ్రామాల వారీగా లెక్కలను సోషల్ మీడియాలో చెప్పేందుకు సిద్ధమవుతున్నది. అదే విధంగా సోషల్ మీడియా టీంలు గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News