'ఆపరేషన్ ఫామ్ హౌస్' రిమాండ్ రిపోర్టులో పోలీసుల చెప్పింది ఇదే..

తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరిగిందని, అందుకు మొయినాబాద్‌లోని ఫామ్ హౌజ్ వేదికగా సంభాషణలు జరిగాయని పోలీసులు ముగ్గురు నిందితుల రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

Update: 2022-10-28 17:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరిగిందని, అందుకు మొయినాబాద్‌లోని ఫామ్ హౌజ్ వేదికగా సంభాషణలు జరిగాయని పోలీసులు ముగ్గురు నిందితుల రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ కారణంగానే ఎమ్మెల్యేలను పార్టీ మారాల్సిందిగా ప్రలోభాలకు గురిచేసిందని పేర్కొన్నారు. ఆపరేషన్ ఫామ్ హౌజ్‌ను ఎలా నిర్వహించిందీ ఆ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఫామ్ హౌజ్‌‌లో నిందితులు, నలుగురు ఎమ్మెల్యేలు కూర్చునే హాల్‌లో నాలుగు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జేబులో రెండు వాయిస్ రికార్డర్లను సెట్ చేసి పెట్టినట్లు పోలీసులు వివరించారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రగా భావించినందునే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చిందని ఆ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు.

ఆపరేషన్ జరిగిన రోజున ఉదయం 11.30 గంటలకే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నుంచి తమకు ఫిర్యాదు అందిందని, పార్టీ మారడానికి తనకురూ. 100 కోట్లు ఆఫర్ చేశారని, తన వెంట పార్టీ మారే ఎమ్మెల్యేలకు తలా రూ. 50 కోట్ల చొప్పున ఇవ్వడానికి డీల్ కుదిరిందంటూ రోహిత్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం పైలట్ రోహిత్ రెడ్డి నేతృత్వంలో ఈ వ్యవహారం జరుగుతున్నందున ఆపరేషన్‌కు సైతం ఆయననే వాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. రోహిత్ రెడ్డి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మధ్యవర్తులుగా వచ్చే ముగ్గురు నిందితులతో జరిగే మీటింగ్ హాల్‌ను ముందుగానే ఫిక్స్ చేసి అక్కడ పకడ్బందీ ప్లాన్‌లో నాలుగు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అనుకున్న ప్లాన్ ప్రకారం మధ్యాహ్నం 3.05 గంటలకు సీసీటీవీలను ఆన్ చేశామని, రికార్డు కావడం మొదలైందని, 3.10 గంటలకు రోహిత్ రెడ్డి ఆ హాల్‌‌లోకి నిందితులతో కలిసి వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. సాయంత్రం 4.10 గంటలకు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు వచ్చారని, సుమారు మూడున్నర గంటల పాటు నిందితులకు, వీరికి మధ్య చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ఆపరేషన్‌లో భాగంగా సమావేశం ముగిసిందనే సంకేతం ఇచ్చేందుకు 'కొబ్బరి నీళ్ళు తీసుకురా..' అని పనివారికి రోహిత్ రెడ్డి పురమాయించే సిగ్నల్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు రిపోర్టులో పోలీసులు వివరించారు. ఆ ప్రకారమే రోహిత్ రెడ్డి నుంచి ఆ సంకేతం రాగానే పోలీసులు హాల్‌లోకి ఎంటర్ అయ్యారని, ఆపరేషన్ స్టార్ట్ అయిందని తెలిపారు.

మొత్తం పాతిక మంది పార్టీ మారేందుకు సంభాషణలు, చాటింగ్‌లో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా స్పై కెమెరాలను, వాయిస్ రికార్డర్లను వాడాల్సి వచ్చిందన్నారు. పార్టీ మారినందుకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్ల ముడుపులు ఈ డీల్ ఉద్దేశమని పేర్కొన్నారు. ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లను ఫోరెన్సిక్ లాబ్ పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులు, ఎమ్మెల్యేల మధ్య జరిగిన సంభాషణలన్నీ స్పై కెమెరాల్లో, వాయిస్ రికార్డర్‌లలో స్టోర్ అయ్యాయని తెలిపారు. 


Similar News