ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీపడిన ప్రభుత్వం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాట్ కామెంట్స్
ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీ పడిన ప్రభుత్వమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీ పడిన ప్రభుత్వమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియా ప్రకటన విడుదల విడుదల చేశారు. అబద్ధాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ అవే అబద్ధాలతో పాలన సాగిస్తోందని ఆరోపించారు. రూ.6 వేల కోట్లతో రుణమాఫీ పూర్తయిందా? రూ.లక్ష రుణం మాఫీ చేశామని చెబుతూ.. రూ.2లక్షలు మాఫీ చేసినట్లు ప్రకటనలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారం చూస్తే గోబెల్స్ కూడా మూర్చపోతారని ఎద్దేవా చేశారు. యాసంగి రైతుబంధులోనే రూ.2 వేల కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. రైతు భరోసా ప్రకారం చూస్తే రూ.6 వేల కోట్లు ఎగ్గొట్టారని మండి పడ్డారు.
వానాకాలం రైతుభరోసా ఊసే లేదని ధ్వజమెత్తారు. 1.30 కోట్ల ఎకరాలకే ఇస్తారనుకున్న రైతులకు ఎకరాకు రూ.7,500 చొప్పున రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టారని, రుణమాఫీ అంటూ ఇప్పుడు రూ.6 వేల కోట్లు ఇచ్చారని అదేవిధంగా రూ.10 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 1.73 కోట్ల మంది మహిళలకు ఏడు నెలలుగా నెలకు రూ.2,500 చొప్పున బాకీ పడిందని, దీని అమలుకు ఏడాదికి రూ.41,700 కోట్లు కావాలి తెలిపారు. 40 లక్షల మంది ఫించన్‌దారులు, దివ్యాంగుల ఏడు నెలలుగా నెలకు రూ.2 వేల చొప్పున బాకీ పడిందన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఏడు నెలలుగా నెలకు రూ.4 వేల చొప్పున బాకీ ఉన్నట్లుగా తెలిపారు.
రాష్ట్రంలో భూమి లేని కౌలు రైతులు 6.5 లక్షల మంది ఉన్నారని, వారికి రూ.15 వేల చొప్పున రూ.975 కోట్లు బాకీ పడిందన్నారు. రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని చెప్పారని, రాష్ట్రంలో 52 లక్షల మందికి పైగా ఉపాధిహామీ కూలీలు ఉన్నారని, ఈ లెక్కన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6240 కోట్లు బాకీ ఉందని వెల్లడించారు. 1.30 కోట్ల టన్నులకు వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున రూ.6500 కోట్లు బోనస్ ఎగ్గొట్టారని, సేకరించిన ధాన్యానికి కూడా రూ.500 బోనస్ ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల మంది విద్యార్థులు పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తి చేసుకుంటున్నారని, వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పది వేల నుండి రూ.లక్ష వరకు బాకీ పడిందన్నారు.