దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక భూమిక పోషించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని బుధవారం రవీంధ్రభారతీలో తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత కవులు, కళాకారులను ఆదుకుంటున్నామన్నారు. సాహిత్య అభివృద్ధి కోసం తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేశామన్నారు. దాశరథి, కాళోజి పేరిట ప్రత్యేక సాహిత్య అవార్డులను ప్రతి ఏటా అందజేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై కవులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పలువురు కవులు, కళాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కవులు అమ్మంగి వేణుగోపాల్, సిద్ధార్థ రామచంద్రమౌళి, వనపట్ల సుబ్బయ్య, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, శ్రీకాంత్ నెల్లెట్ల రమాదేవి, జూపాక సుభద్ర, అయనంపూడి శ్రీలక్ష్మి తదితరులుపాల్గొన్నారు.