'టచ్‌లో ఉన్నారు'.. టీఆర్‌ఎస్‌పై బీజేపీ కొత్త స్కెచ్!

మీ ముఖ్య నేతలు మాతో టచ్‌లో ఉన్నారు.

Update: 2022-12-05 08:25 GMT

దిశ, వెబ్ డెస్క్: మీ ముఖ్య నేతలు మాతో టచ్‌లో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో బీజేపీ నేతలు తరచూ అంటున్న మాట. ఆయా రాష్ట్రాల్లో ఎలాగైనా తమ సత్తా చాటాలని బీజేపీని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి తేవాలని బీజేపీ స్కెచ్ వేసింది. తమకు అడ్డు వస్తున్న పార్టీలను సెల్ఫ్ డిఫెన్స్‌లోకి నెడుతూ, తమపై దూకుడుగా వ్యవహరించే నేతలను దెబ్బతీయాలనే వ్యుహంతో ముందుకు సాగుతోంది. బీజేపీ నేతల ఈ వ్యాఖ్యలు తరచూ సంచలనంగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో బెంగాల్ రాజకీయాల్లో సైతం టచ్‌లో ఉన్నారనే వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమతాబెనర్జీ గెలవగా ప్రధాని మోడీ తమతో 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారనడం సంచలనంగా మారింది. ఈ అంశాన్నే కేసీఆర్ నిన్న బహిరంగ సభలో ఖండించారు. ప్రధాని స్థాయి వ్యక్తి అలా అనవచ్చా అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి బీజేపీ నేత నిశిత్ ప్రమానిక్ సైతం తమతో 40-45 టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యలు బెంగాల్‌లో దుమారం రేపాయి.

పార్టీల్లో టెన్షన్..

తమతో కీలక నేతలు టచ్‌లో ఉన్నారని రాష్ట్రంలో తరచూ బీజేపీ ముఖ్య నేతలు వ్యాఖ్యనించడం చూస్తునే ఉన్నాం. చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేంధర్ సహా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే అంశాన్ని తరచూ ప్రస్తావిస్తున్నారు. కాగా ఇటీవల ఆ స్థాయిలోనే పార్టీలోకి కీలక వ్యక్తులు వస్తుండటంతో అధికార పార్టీలో ఆందోళన నెలకొంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెబుతుండగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.

బీజేపీ నేతల ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తమ పార్టీని ఎవరు వీడుతారో ననే టెన్షన్ రెండు పార్టీల్లో మొదలైంది. అభ్యర్థులే లేరని బీజేపీని విమర్శిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చే దిశగా బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి బీజేపీ పార్టీ కండువా కప్పింది. రంగారెడ్డి జిల్లాలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఇటీవల పార్టీలో చేర్చుకుంది. నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వరంగల్‌లో ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు బీజేపీలో చేరారు.

20-40 మంది టార్గెట్..

ఇలా కీలక నేతలపై దృష్టి పెట్టిన బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు మరో 20-40 మంది కీలక నేతలను తమ వైపునకు తిప్పుకునే దిశగా కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీతో విభేదిస్తున్న కీలక నేతలపై ఇప్పటికే బీజేపీ నజర్ వేసింది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు సొంత నాయకులతోనే విభేదాలున్న నేపథ్యంలో ఆ నేతలను టార్గెట్ చేసింది. వారికి టికెట్ల హామీ ఇచ్చైన సరే పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అమిత్ షా, మోడీ ద్వయం తెలంగాణపై దృష్టి సారించిన నేపథ్యంలో గ్రౌండ్ లెవల్లో పనిచేయాలని చేరికలను ప్రోత్సహించాలని కీలక నేతలకు అధిష్టానం భరోసా కల్పిస్తున్నట్లు సమాచారం.

టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని ఇప్పటికే బీజేపీ ప్రచారం చేసి సక్సెస్ అయిన క్రమంలో ఇక పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులను పార్టీ వ్యవహారాల్లో యాక్టివ్ చేయాలని అధిష్టానం భావిస్తోంది. బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా ఈనెల 16న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రాష్ట్ర నాయకులకు బీజేపీని బలోపేతం చేయడంపై దిశా నిర్ధేశం చేయనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. మరి బీజేపీ వ్యుహాలను అధికార టీఆర్ఎస్ రానున్న రోజుల్లో ఎలా ఎదుర్కుంటుందే తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.  


Similar News