Koppula Ishwar:‘ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
రైతులకు హామీలు ఎన్నో ఇచ్చారు.. ఒక్కటీ అమలు చేయలేదు.. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు హామీలు ఎన్నో ఇచ్చారు.. ఒక్కటీ అమలు చేయలేదు.. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పుట్టా మధు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘు వీర్ సింగ్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మళ్ళీ సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పునరావృతం అవుతున్నాయన్నారు. రైతుల ఆత్మహత్యలు మళ్ళీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా గత ఏడాది కాలం లో 620 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ సరిగా జరగలేదు. రైతు భరోసా లేదు ..ఇరిగేషన్ సదుపాయాలు రాష్ట్రంలో కుంటు పడ్డాయన్నారు.
రైతు ఆత్మహత్యలు పెరుగుతున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో రైతు ఏ కారణంతో చనిపోయిన 5 లక్షల బీమా మొత్తం వచ్చేదన్నారు. ఎందు కోసం సంబరాలు చేస్తున్నారు అని నిలదీశారు. రైతు భరోసా ఇవ్వబోమని ప్రభుత్వం, మంత్రులు రైతులను మానసికంగా సిద్ధం చేస్తున్నారని, అందులో భాగంగానే వ్యవసాయ శాఖ మంత్రి రైతు భరోసా కన్నా బోనస్ బాగుతుందని ప్రకటన ఇచ్చారన్నారు. రైతు పండగ చేసుకోవడం చూసి రైతులు నవ్వుకుంటున్నారన్నారు. ఏ వర్గం కూడా రేవంత్ పాలనతో సంతృప్తిగా లేదన్నారు. ఈ ఏడాదిలో ప్రతి ఒక్కరినీ మోసం చేశారన్నారు. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని సంబరాల పేరుతో వృధా చేస్తున్నారన్నారు. గురుకులాలను రేవంత్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఓవరీసిస్ స్కాలర్ షిప్ లపై పట్టింపు లేదన్నారు. మానవత్వం మరిచిపోయి మంత్రులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లల భవిష్యత్ ను రేవంత్ ప్రభుత్వం సర్వ నాశనం చేస్తోందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రభుత్వం న్యాయం చేస్తోందని ఆరోపించారు. ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు.. ఇకనైనా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు.