అక్కడా అదే సీన్.. హస్తం పార్టీలో పీక్స్‌కు చేరిన గ్రూపు తగాదా
రాజకీయంగా కష్ట కాలంలో ఉండి నత్త నడక నడుస్తున్న కాంగ్రెస్ పార్టీలో కుంప్పట్ల రాజకీయం మరింత రాజుకుంది.
దిశ, వైరా: రాజకీయంగా కష్ట కాలంలో ఉండి నత్త నడక నడుస్తున్న కాంగ్రెస్ పార్టీలో కుంప్పట్ల రాజకీయం మరింత రాజుకుంది. వైరా నియోజకవర్గంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి రేణుకా చౌదరి వర్గాలుగా విడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీలోని నాయకులు ఎవరికి వారే యమునా తీరులా ముందుకు సాగుతున్నారు. ఈ రెండు వర్గాల వారు తమ రూటే సపరేటు అని నియోజకవర్గ ప్రజలకు సంకేతాలు వెళ్లేలా ప్రవర్తిస్తున్న తీరు పార్టీని మరింత సుడిగుండంలోకి నెట్టివేస్తుంది.
ప్రస్తుతం వైరాలో రేణుకా చౌదరి వర్గం నుంచి ధరావత్ రాంమ్మూర్తి నాయక్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క వర్గం నుంచి మాలోత్ రాందాస్ నాయక్, భానోత్ బాలాజీ నాయక్ టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే వీరిలో మాలోత్ రాందాస్ నాయక్, ధరావత్ రాంమ్మూర్తి నాయక్ కాంగ్రెస్‌లో యాక్టివ్ పాలిటిక్స్ నిర్వహిస్తూ ఎవరికి వారే క్యాంపు కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. భానోత్ బాలాజీ నాయక్ మాత్రం ఎక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహించకుండా సైలెంట్‌గా ఉంటున్నారు.
అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో రాందాస్ నాయక్, రాంమ్మూర్తి నాయక్ మధ్య నెలకొంటున్న గ్రూపు రాజకీయం బహిరంగ రహస్యమే. రేణుకా చౌదరి వర్గీయులు వైరాలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈనెల 26వ తేదీన జోడోయాత్ర, బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యరావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని వివరించారు. అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని భట్టి వర్గీయులు పేర్కొంటున్నారు.
రేణుక వర్గీయుల బల ప్రదర్శన..
వైరాలోని రాంమ్మూర్తి నాయక్ క్యాంపు కార్యాలయంలో సోమవారం రేణుకా చౌదరి వర్గీయులు బల ప్రదర్శన చేసినంత పని చేశారు. రాంమ్మూర్తి నాయక్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి జిల్లాలోని రేణుకా చౌదరి వర్గీయులంతా హాజరై తమ బలాన్ని చాటి చెప్పేందుకు ప్రయత్నించారు. రేణుకా చౌదరి ఆధ్వర్యంలో జోడోయాత్ర, బహిరంగ సభ జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి హాజరవుతారని వివరించారు.
అయితే పార్టీ ముఖ్య నాయకులు వచ్చే విషయం భట్టి వర్గీయులకు కనీస సమాచారం లేని విషయం వైరాలో ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసలే వైరా నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో కొనసాగుతుంది. మండల కేంద్రాలతో పాటు, గ్రామాల్లో పార్టీని ముందుకు నడిపే బలమైన నాయకులే కరువయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి బహిరంగంగా తమ వర్గాలను బహిర్గతం చేయటం కాంగ్రెస్ వాదులకు మింగుడు పడటం లేదు.
"నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు" అన్న విధంగా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలను నాయకులు పెంచి పోషిస్తున్నారని ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతల పర్యటన ఉన్నప్పుడు వర్గాలకు అతీతంగా కార్యక్రమాలను నిర్వహించకుండా.. ఒంటెద్దు పోకడలు కొనసాగుతుండటంతో పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్య నేతలు వచ్చే సమాచారం తమకు తెలియదని భట్టి వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారంటే పార్టీలోని గ్రూపు రాజకీయాలు ఏ స్థాయిలో కొనసాగుతున్న అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు వైరాలో భట్టి విక్రమార్క నిర్వహించే కార్యక్రమాలకు తమకు ఎలాంటి సమాచారం అందటం లేదని రేణుక వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. ఈ గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే రెండు గ్రూపుల వారు ఒకరిపై మరొకరు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాల్సిన కాంగ్రెస్ నాయకులు ఆ పనిని పక్కనపెట్టి గ్రూపు రాజకీయాల పుణ్యమా అని ఒక గ్రూపుపై మరో గ్రూపు వారు అంతర్గతంగా విమర్శించుకోవటానికే సమయాన్ని కేటాయించడం పార్టీ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ గ్రూపులు ఇంత దారుణంగా కొనసాగుతున్నా.. పార్టీ అధిష్టానం మాత్రం "తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి" అన్నట్లు వ్యవహరించటం విశేషం. ఈ గ్రూపుల వల్ల సగటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీకి పోయేకాలం దగ్గర పడిందని విమర్శించడం విశేషం. ముందుగా పార్టీ నాయకులు ఐక్యంగా కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ వాదులు కోరుతున్నారు. పార్టీ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన తర్వాత అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తే వారి గెలుపునకు ఐక్యంగా శ్రమించాలని నాయకులు అంటున్నారు.
కానీ "ఆలు లేదు చూలు లేదు అల్లుడు పేరు సోమలింగం" అన్నట్లు టికెట్ కోసం వర్గాలుగా నాయకులు విడిపోయి తమకే టికెట్ వస్తుందని ఆశావాహులు చెప్పుకుంటూ గ్రూపుల వారీగా ముఖ్య నేతల కార్యక్రమాన్ని నిర్వహించడం విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారాలపై దృష్టి సారిస్తుందో.. లేదంటే ఇదంతా తమ పార్టీకి సాంప్రదాయబద్ధమే అని వదిలేస్తుందో వేచి చూడాల్సిందే.