మాజీ స్పీకర్ పోచారానికి కీలక పదవి.. రేవంత్ సర్కార్ భారీ స్కెచ్..?

బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉండి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం వ్యవసాయ

Update: 2024-06-24 02:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉండి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌గా నియమించడంపై కసరత్తు చేస్తోంది. కేబినెట్ హోదాతో కూడిన బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నది. ఆయనకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఆ బాధ్యతలు అప్పజెప్పడం రీజనబుల్‌గా ఉంటుందనే చర్చ జరగడంతో త్వరలో దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నది.

సుదీర్ఘ రాజకీయ అనుభవం..

రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పవర్‌లోకి వచ్చిన ఫస్ట్ టర్ములో పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. రెండో టర్ములో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ టైంలో మంత్రిగా అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే,ఆ జిల్లా నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆ జిల్లా నుంచి కేబినెట్‌లో ఇప్పటివరకు ప్రాధాన్యత లేదు. ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తదితరుల్లో ఒకరికి మంత్రిగా చాన్స్ లభిస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

త్వరలో ఉత్తర్వులు..

ఒకే విడతలో రుణమాఫీ, రానున్న రోజుల్లో రైతు భరోసా, కౌలు రైతులకు సైతం ప్రభుత్వం తరఫున సాయం.. ఇలాంటి అనేక అంశాలు పెండింగ్ ఉన్న టైంలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. దీనికి చైర్మన్‌‌గా పోచారం శ్రీనివాసరెడ్డిగా బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది.ఆయన నియామకానికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులను వెల్లడించే అవకాశమున్నది.

కొడుకు రాజకీయ భవిష్యత్‌కు భరోసా..

రైతు కుటుంబం నుంచి వచ్చినట్లు పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పుకోవడంతో పాటు ఆ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను సీఎం రేవంత్‌తో చర్చించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. కుమారుడికి రాజకీయ భవిష్యత్ కల్పించడంపైనా జరిగిన చర్చలో సీఎం రేవంత్ పాజిటివ్‌గా స్పందించారని, 2028లో అసెంబ్లీ ఎన్నికల నాటికి జరగనున్న నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుందన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం.


Similar News