సమయం లేదు మిత్రమా.. సునీల్ కనుగోలు ఎంట్రీతో కాంగ్రెస్ లోకి బడా నేతలు?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పలువురు ఇతర పార్టీ నేతలు హస్తం గూటికి క్యూ కడుతున్నారు.

Update: 2024-02-17 13:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పలువురు ఇతర పార్టీ నేతలు హస్తం గూటికి క్యూ కడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో చేరికల జోరు స్పీడందుకుంది. ఇదే బాటలో మరికొంత మంది ఉన్నారనే చర్చ జరుగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు భేటీ కావడం, ఈ భేటీ జరిగిన మరుసటి రోజే బీజేపీకి చెందిన కీలక నేత ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే టాక్ పెద్దఎత్తున వినిపించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వీరి మధ్య చర్చ జరిందనే ప్రచారం పైకి జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ లోకి వలసలపై వీరి చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ లోకి పెద్ద తలకాయలు:

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దింపి కాంగ్రెస్ ను అధికారం తీరం వైపు నడిపించడంలో సునీల్ కనుగోలు వ్యూహాలు కలిసి వచ్చాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వలసల విషయంలో తన వ్యూహం మార్చుకుని ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మొదలు పెట్టాల్సిన చేరికలను ముందుగానే ప్రారంభించిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతుండగా బీఆర్ఎస్, బీజేపీలోని పెద్ద తలకాయలపై గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలువురిని ఇప్పటికే టచ్ లోకి తీసుకుందని అదును చూసి కండువా కప్పుకునేందుకు నేతలు, కప్పేందుకు కాంగ్రెస్ రెడీ గా ఉందనే చర్చ జరుగుతోంది. సీఎంతో సునీల్ కనుగోలు భేటీలో కాంగ్రెస్ లోకి ఎవరెవరిని ఆహ్వానించాలనేదానిపై కీలక చర్చ జరిగిందనే టాక్ వినిపిస్తోంది.

అదును కోసం నేతల ఎదురుచూపులు:

రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితిలు మారిపోతున్నాయి. అధికారంలో ఉండగా అంతా సవ్యంగానే జరిగినా అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా నేతలు పక్కచూపులు చూస్తున్నారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తితో ఉన్నారని ఇక బీజేపీలోనూ ఇదే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. సీఎం, సునీల్ కనుగోలు భేటీ జరిగిన మరుసటి రోజే ఈటల రాజేందర్ బీజేపీకి గుడ్ బై చెబుతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ఈటల వంటి పలువురు నేతలు కాంగ్రెస్ వైపు ఆసక్తితో ఉన్నప్పటికీ బలమైన రీజన్ కోసం ఎదురు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతలో రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు పొత్తు పెట్టుకోబోతున్నాయనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో ఇదే నిజం అయితే గనుకు ఇరు పార్టీలలోను కీలక నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యే సూచనలే ఎక్కువ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో చేరికల విషయంలో సీఎంతో సునీల్ కనుగోలు ఏం చెప్పారు? బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎవరెవరూ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News