అమెరికాలో రైతు చట్టాలు పక్కాగా అమలు.. భారత్‌లో పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

దుక్కి దున్నే నాడు చెమటోడస్తున్న రైతన్న.. పంట మార్కెట్​తరలేనాటికి మాయమవుతున్నాడు. జూదంలో పందెంలా మారింది రైతన్న దుస్థితి.

Update: 2024-09-04 12:46 GMT

దుక్కి దున్నే నాడు చెమటోడస్తున్న రైతన్న.. పంట మార్కెట్​తరలేనాటికి మాయమవుతున్నాడు. జూదంలో పందెంలా మారింది రైతన్న దుస్థితి. పండించిన పంటకు కనీస ధరను కూడా నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అధికారులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే.. కొన్నేండ్ల తర్వాత రైతులు అనేవాళ్లు ఉండేవారని చెప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది ప్రతి రైతు కోసమే.. రైతు కోసం అనగానే స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరం రైతుకు ఏదో ఒక రకంగా రిలేషన్ ఉన్నవాళ్లమే. మెజార్టీ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారమే. అందుకే ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథనమిది. మీ ఊర్లో ఉండే కనీసం ఒక్క రైతుకైనా మీ బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంది. అవును.. రైతును కాపాడేందుకు మీ వంతు బాధ్యత అనుకోండి. మనకు మూడు పూటలా అన్నం పెడుతున్న రైతన్న కోసం వారికి ఉన్న హక్కులేమిటో అవగాహన కల్పిద్దాం. = శిరందాస్ ప్రవీణ్‌కుమార్

Full View

హక్కులు తెలిస్తేనే ప్రశ్నించవచ్చు..

భారతదేశంలో రైతులకు పాలకులు ఏం చేయలేదా? వ్యవసాయాన్ని కాపాడేందుకు ఏం చర్యలు తీసుకోలేదా? రైతుకు ఏం హక్కులు లేవా? ఎస్.. ఇప్పుడిది తెలుసుకోవాల్సిందే. ఇన్నాండ్లుగా వారికి ఏం హక్కులు ఉన్నాయో రైతులు తెలుసుకోకపోవడం వారి తప్పే. నాకు అన్యాయం జరిగింది? నేను మోసపోయాను? నేను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేదు? పగలు, రాత్రి తేడా లేకుండా నేను కష్టపడితే నాకు ఏం వచ్చింది? ఇవి రోజూ వినిపించే ప్రశ్నలు. వీటికి సమాధానాలు రాబట్టాలంటే, రైతుకు న్యాయం దక్కాలంటే ముందు వారికి ఉన్న హక్కులు ఏమిటో తెలుసుకోవాలి. ప్రశ్నించాలంటే ఏ హక్కులు ఉన్నాయో తెలియాలి.. అప్పుడే న్యాయం పొందే వీలుంటుంది.

తెలంగాణలోనూ 65 చట్టాలు..

దేశంలో రైతు, వ్యవసాయం కోసం 5 వేల చట్టాలు ఉన్నాయంటే నమ్ముతారా? అవును.. ఇది నిజం. తెలంగాణలోనే 65 చట్టాలు ఉన్నాయి. రాచరిక వ్యవస్థలోనూ రైతుకు న్యాయం చేసేందుకు మార్కెటింగ్ చట్టాలు అమలయ్యానంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం. హైదరాబాద్ సంస్థానంలోనే రైతు పండించిన పంటను అమ్ముకునేందుకు నిజాం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి దాని ఆధారంగానే మరికొన్ని అమల్లోకి వచ్చాయి. రైతు దుక్కి దున్ని విత్తనాలు చల్లే నాటి నుంచి పండిన పంటను మార్కెట్ కి తీసుకెళ్లి మినిమం గ్యారంటీ ప్రైస్ ని పొందే వరకు చట్టాలు ఉన్నాయి. వీటి గురించి ఇన్నాండ్లుగా రైతులు తెలుసుకోకపోవడం, వారికి అవగాహన కల్పించని మేధావి వర్గానిదే తప్పు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో పకడ్బందీ వ్యవసాయ చట్టాలు అమలవుతున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. వ్యవసాయిక దేశంగా పిలిచే మన దేశంలో ఈ చట్టాలు ఎందుకు అమలు కావడం లేదు? ఎక్కడ లోపాలు ఉన్నాయి? అందుకోసం ప్రభుత్వాలు, ఎన్జీవోలు, రైతు ప్రతినిధులు ఏం చేయాలి? ఇప్పుడీ అంశాలపైనే దేశంలోనే భూ చట్టాల నిపుణుడుగా పేరుగాంచిన లీఫ్స్ సంస్థ అధ్యక్షుడు భూమి సునీల్ చెప్పిన విషయాలను ప్రతి రైతుకు చెప్పాల్సిన అవసరం ఉంది.

5 వేల చట్టాలు ఉన్నా.. అమలవుతున్నాయా?

లీఫ్స్ సంస్థ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని చట్టాలపై అధ్యయనం చేశాం. దేశంలో అమల్లో ఉన్న చట్టాల లెక్క తీస్తే 5 వేలు కాదు.. 6 వేల దాకా వచ్చాయి. ఇవన్నీ దాదాపుగా అమల్లో ఉన్నవే. పాలకులు ఎప్పటికప్పుడు రైతుల కోసం చట్టాలైతే తీసుకొస్తున్నారు.

రాచరికపు వ్యవస్థ నుంచే మార్కెటింగ్ చట్టం ఉందా?

దేశంలో స్వాతంత్ర్యం రాకముందు నుంచే రాచరికపు వ్యవస్థలోనూ చట్టాలు ఉన్నాయి. హైదరాబాద్ సంస్థానంలోనూ నిజాం రైతుల కోసం మార్కెటింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1917 లోనే అమల్లోకి తీసుకొచ్చారు. దాని ఆధారంగానే మార్కెటింగ్ చట్టాలను మారుస్తూ వస్తున్నారు. అదే మూలంగా తీసుకుంటున్నారు.

మరి రైతుకు ఎందుకు న్యాయం దక్కడం లేదు?

దేశ వ్యాప్తంగా 6 వేల చట్టాల వరకు అమల్లో ఉన్నాయి. భూమి హక్కుల చట్టాలతో పాటు వ్యవసాయ రంగం, రైతు అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన చట్టాలు అనేకం ఉన్నాయి. వీటిపై చాలామందికి అవగాహన లేదు. ఒక రకంగా చెప్పాలంటే అధికారులకే ఇన్ని చట్టాలు ఉన్నాయని తెలియదు. అందుకే రైతు నష్టపోయినప్పుడు న్యాయం చేయడంలో తాత్సారం జరుగుతున్నది.

ఏయే అంశాల మీద చట్టాలు ఉన్నాయి?

విత్తనాల కొనుగోళ్లు, వాటితో నష్టపోతే నష్టపరిహారం.. దీనికే ఆరు చట్టాలు ఉన్నాయి. నీళ్లు, ఎరువులు, మందులు, క్రాప్ ఇన్సూరెన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్, కార్పొరేట్ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయ చట్టం.. ఇలా 30 అంశాలకు పైగానే ఉన్నాయి. విత్తనాల చట్టం కూడా కొత్తగా రాబోతున్నది. తెలంగాణలోనే 65 చట్టాలు ఉన్నాయి. ఎంత మందికి వీటి గురించి తెలుసు?

ఈ చట్టాలతో ఎలాంటి న్యాయం దక్కుతుంది?

ఉదాహరణకు దేశంలో నకిలీ విత్తనాలు, మందులతో రైతులు నష్టపోతున్నారు. కొనుగోలు చేసేటప్పుడు రశీదు తీసుకోవాలి. ఆ ప్యాకెట్ ని భద్రం చేసుకోవాలి. ఈ రెండు ఉంటే చాలు. నష్టపరిహారం పొందొచ్చు. వినియోగదారుల కోర్టులో తెల్ల కాగితం మీద ఫిర్యాదు చేస్తే చాలు. ఇలాంటి చట్టాలను ఎంత మంది రైతులు వినియోగించుకున్నారు? నకిలీ విత్తనాలతో నష్టపోయామంటూ రోడ్డు ఎక్కుతారు. పోరాటాలు చేస్తారు. దాంతో పాటు ఇదొక్కటి చేయాలని ఏ నాయకుడు చెప్పడు. ఆ కంపెనీల మీద కేసు పెట్టారని తెలిస్తే చాలు. రైతుల దగ్గరికి వచ్చి బతిలాడుకునే పరిస్థితి ఉంటుంది. కోర్టుకు కూడా వెళ్లొచ్చు. వివిధ సందర్భాల్లో న్యాయ సేవా అథారిటీలకు ఫిర్యాదు చేయొచ్చు. ఇదేం ఖర్చుతో కూడిన పని కూడా కాదు. అన్యాయం, నష్టం వాటిల్లిందంటే దానికి తగ్గ చట్టాలను వెతకడంలోనూ పని ఉంది.

చట్టాలపై అవగాహన ఏది?

వాస్తవానికి మనది వ్యవసాయిక దేశం. కానీ అందుకు సంబంధించిన చట్టాల గురించి సరైన అవగాహన కల్పించకపోవడం వల్లే రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. నిజంగానే రైతు ఉండేవాడు అని చెప్పుకునే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలే వ్యవసాయం చేసే రోజులు వచ్చేశాయి. వారి దగ్గర రైతులు కూలీలుగా పని చేయాల్సి వస్తుంది. ప్రతి ఊరిలోనూ ఒక్కరైనా ఈ చట్టాల గురించి రైతుకు చెప్పే వారు ఉండాలి. నాయకులు కూడా వీటిపై అవగాహన పెంపొందించుకోవాలి.

అమెరికాలో అమలవుతున్నాయా?

అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ చట్టాలు పక్కగా అమలవుతున్నాయి. ఫ్లాగ్(ఫార్మర్స్ లీగల్ యాక్షన్ గ్రూప్) వంటి ఎన్జీవోలు పని చేస్తున్నాయి. పలు దేశాల్లో రైతుల కోసం పనిచేసే సంస్థలు ఉన్నాయి. యూరోప్ లోని కొన్ని దేశాల్లోనూ క్యాపిటలిజం నియంత్రణ, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వంటి వాటికి చట్టాలు ఉన్నాయి.

అవగాహన కల్పించాలంటే ఏం చేయాలి?

అగ్రికల్చర్‌కి ఒక్క లాయర్​కూడా లేడు. అసలు దీనిపై కోర్సులే లేవు. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయం, రైతుల కోసం గ్రాడ్యుయేషన్, మాస్టర్ కోర్సులు ఉన్నాయి. భూమి చట్టాలతో పాటు వీటిపైనా న్యాయ కళాశాలల్లో ప్రత్యేక కోర్సులను ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవాలి. అప్పుడే రైతుకు న్యాయం చేయవచ్చు. ప్రతి ఊరిలోనూ కనీసం ఒక్కరైనా రైతుకు న్యాయం చేసేందుకు చట్టాల ఉన్నాయని చెప్పేందుకు ఉండాలి.

లీఫ్స్ సంస్థ ద్వారా ఎలాంటి ప్రయత్నం చేశారు?

దేశంలో ఎక్కడా లేని విధంగా మేం బమ్మెర, వరంగల్ కోర్టులో అగ్రి లీగల్ ఎయిడ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఉచిత న్యాయా సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. హైకోర్టు కూడా లీగల్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది.

ప్రతి ఊరిలోనూ రైతుకు అన్యాయం జరిగినప్పుడు, నష్టం వాటిల్లినప్పుడు.. ఇదిగో ఫలానా చట్టం ద్వారా నీకు న్యాయం దక్కుతుందన్న భరోసా ఎవరు ఇవ్వాలి?

దేశవ్యాప్తంగా లీగల్ కో ఆర్డినేటర్స్ ఉండాలి. ప్రతి పంచాయతీల్లోనూ అగ్రి లీగల్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు కావాలి. యాక్టివ్ గా ఉండే రైతుకు ఈ చట్టాలపై అవగాహన కల్పించాలి. వారి ద్వారా రైతుల సందేహాలను నివృత్తి చేయాలి. వీరి సేవలను లీగల్ సెల్‌కి లింక్ చేయాలి. రైతుకు అన్యాయం జరిగిందంటే ఈ సెల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలను అందించాలి. స్టేట్ సపోర్టింగ్ టీమ్ కూడా ఏర్పాటు కావాలి. గ్రామంలో ఉండే కో ఆర్డినేటర్ కి ఓ ట్యాబ్ ఇస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించొచ్చు. లీగల్ అథారిటీ సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలి.

ప్రభుత్వాలు ఏం చేయాలి?

తెలంగాణలో ప్రతి ఊరిలోనూ రైతు వేదికలు ఉన్నాయి. ప్రతి గ్రామానికో కో ఆర్డినేటర్ ని ఎంపిక చేసుకొని రైతు, వ్యవసాయ చట్టాలపైనే పని చేయించాలి. ఎలాగూ వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించే బలమైన వ్యవస్థ ఉంది. వారిని కూడా అనుసంధానం చేయాలి. ప్రతి గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలవుతుంది. అలాగే అగ్రి చట్టాలపై ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టాలి. వారి ద్వారా ఎన్నో సేవలను రైతులకు అందించే వీలవుతుంది.

న్యాయ వ్యవస్థ ద్వారా రైతు కోసం ఏం చేయాలి?

లీగల్ సెల్ అథారిటీల ద్వారా ప్రతి గ్రామంలోనూ లీగల్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. సుప్రీం కోర్టు కూడా రైతులకు ఉచిత న్యాయ సేవలను అందించాలని చెప్తున్నది.

మేధావి వర్గం, రైతు సంఘ నాయకులు ఏం చేయాలి?

రైతులు నష్టపోయినప్పుడు, అన్యాయానికి గురైనప్పుడు రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేయొచ్చు. కానీ ఆ రైతుకు న్యాయం అందించేందుకు చట్టాలు ఏమైనా ఉన్నాయా? అని ముందుగా అధ్యయనం చేయాలి. ఏ చట్టం కింద రైతుకు నష్టపరిహారం ఇప్పించగలమో ఆలోచించాలి. చట్టాల మీద అవగాహన పెంపొందించాలి. నకిలీ విత్తనాలతో నష్టపోతే ఆ కంపెనీ నుంచే నష్టపరిహారం పొందే వీలుంది. ఈ అంశాలను రైతులు, రైతు సంఘ నాయకులు గుర్తించాలి.


Similar News