అప్పుడు బ్రిటిష్...ఇప్పుడు బీజేపీ.. నగరంలో మరోసారి పోస్టర్ల కలకలం
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ నేపథ్యంలో నగరంలో మరోసారి ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ నేపథ్యంలో నగరంలో మరోసారి ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. అప్పుడు బ్రిటీష్...ఇప్పుడు బీజేపీ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. దేశంలో బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు నెలకొన్నాయంటూ గుర్తుతెలియని వ్యక్తులు వాల్ పోస్టర్లను ఏర్పాటు చేశారు. దేశాన్ని పాలించిన బ్రిటిష్ పాలకులు ఆనాడు స్వాతంత్ర సమరయోధుల అణచివేసారని, అదే మాదిరి నేడు బీజేపీ పాలకులు ప్రతిపక్ష పార్టీలను అణగ తొక్కుతున్నారంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.
బ్రిటిష్ జెండాతో మహాత్మా గాంధీజీ, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమరయోధుల ముఖాన్ని కప్పుతూ, ప్రస్తుతం కాషాయరంగు ఉన్న బీజేపీ చేయి ప్రతిపక్షపార్టీల నేతల నోటికి అడ్డంగా పెట్టి పోస్టర్లు వెలిశాయి. ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది మహాత్మ కాపాడు..’బైబై మోడీ అంటూ వెలసిన పోస్టర్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.