'ప్రీతి కేసులో డీఎంఈపై చర్యలేవి?'.. విశ్వహిందు పరిషత్ డిమాండ్

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సంచలన ఘటన ప్రీతి ఆత్మహత్య విషయంలో తప్పుడు నివేదిక ఇచ్చిన డీఎంఈ పై చర్యలేవని విశ్వహిందు పరిషత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Update: 2023-06-09 14:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సంచలన ఘటన ప్రీతి ఆత్మహత్య విషయంలో తప్పుడు నివేదిక ఇచ్చిన డీఎంఈ పై చర్యలేవని విశ్వహిందు పరిషత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రీతి హత్య, ఆత్మహత్య విషయంలో తప్పుడు నివేదికను అందజేశారని, వాస్తవాలను తారుమారు చేసేందుకు ప్రయత్నం చేసిన డీఎంఈ రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

ఈ మేరకు శుక్రవారం విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. లవ్ జిహాద్‌లో భాగంగా వేధింపులకు పాల్పడడంతో మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. కానీ, వాస్తవాలను కప్పిపుచ్చేందుకు డీఎంఈ ఒకల్తపుచ్చుకొని సైఫ్ అనే విద్యార్థి ఏ విధమైన వేధింపులకు పాల్పడలేదని.. ప్రీతి తనకు తానే సూసైడ్ చేసుకుందని అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారని, వాస్తవాలను తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వాస్తవాలు ఇప్పుడే బయటకు వచ్చాయని, సైఫ్ వేధింపులతోనే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని అధికారులు తేల్చేశారని స్పష్టం చేశారు.

మొత్తంగా వరంగల్ పోలీసులు ప్రీతి ఘటనపై చార్జ్ షీటు దాఖలు చేశారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సైఫ్ నిర్దోషిగా తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా రంజాన్ కు రెండు రోజుల ముందుగానే సైఫ్ ను జైలు నుంచి విడుదల కూడా చేసి ఓటు బ్యాంకు రాజకీయాల మార్కును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చాటుకుందని విమర్శించారు. ఏది ఏమైనా పోలీసుల చార్జిషీట్ ఆధారంగా సైఫ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, కులం, మతం పేరుతో దూషించిన సైఫ్ ను శాశ్వతంగా మెడికల్ విద్యకు దూరం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Similar News