వీరులారా వందనం.. అమరుల యాదిలో స్మృతి మందిరం
ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన అమరులను స్మరిస్తూ.. వారి త్యాగాలను భవిష్యత్ తరాలు చిరకాలం స్మరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజ్వలిస్తున్న జ్యోతి ఆకృతిలో తెలంగాణ అమరవీరుల స్మృతి వనం నిర్మించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన అమరులను స్మరిస్తూ.. వారి త్యాగాలను భవిష్యత్ తరాలు చిరకాలం స్మరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజ్వలిస్తున్న జ్యోతి ఆకృతిలో తెలంగాణ అమరవీరుల స్మృతి వనం నిర్మించింది. తొలి, మలి దశ పోరాటాల్లో ఆత్మబలిదానం చేసిన వాళ్ల త్యాగనిరతిని, స్ఫూర్తిని భావితరాలకు కళ్లకు కట్టనున్నది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభం కానున్న ఈ స్మారక భవనం తెలంగాణ ప్రజల మదిలో చెరగని ముద్ర వేయనున్నది.
తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరుల స్ఫూర్తిని, త్యాగనిరతిని భావి తరాలకు విడమరిచి చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ సమీపంలో భారీ స్మారక మందిరాన్ని నిర్మించాలని భావించింది. సీఎం కేసీఆర్ 2016 జూన్ 4న దీనికోసం భూమిపూజ చేశారు. సుమారు రూ. 179 కోట్ల ఖర్చుతో నిర్మించిన అమరుల స్థూపానికి అనేక ప్రత్యేకతలున్నాయి. దీని డిజైన్‌ను హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి రూపొందించారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన నిర్మాణపు పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
దుబాయ్ నుంచి స్టీల్
అమరవీరుల స్మారక స్థూపం కోసం ప్రత్యేకంగా దుబాయ్ నుంచి 316-ఎల్ గ్రేడ్ రకం స్టెయిన్‌లెస్ స్టీల్‌ను కాంట్రాక్టు సంస్థ నుంచి తెప్పించుకున్నది. సుమారు 150 మీటర్ల చుట్టుకొలతతో ఉండే మొత్తం కట్టడానికి ఈ స్టీల్‌నే బయటవైపు వాడుతున్నారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా తుప్పు పట్టడానికి ఆస్కారం ఉండదు. దీనిని బిగించేందుకు దుబాయ్ నుంచి నైపుణ్యం ఉన్న వారిని రప్పించారు. తొలుత 100 టన్నుల స్టీల్ అవసరమవుతుందని భావించినా నిర్దిష్ట షేప్ కోసం వేస్టేజీని కూడా పరిగణనలోకి తీసుకుని అదనంగా తెప్పించాల్సి వచ్చింది.
అతుకుల్లేకుండా అమరిక
స్టెయిన్‌లెస్ స్టీల్ షీట్లను కట్టడం చుట్టూ అమర్చాల్సి ఉన్నందున ఎక్కడా అతుకుల్లేకుండా స్పెషల్ టెక్నాలజీ వాడుతున్నారు. విదేశీ కార్లకు వాడుతున్న అధునాతన వెల్డింగ్ టెక్నాలజీ (మైక్రో)ని దీనికి వినియోగిస్తున్నారు. ఎక్కడా బయటికి అతుకులు కనిపించకుండా ఒక షీట్‌కు మరో షీట్‌కు ఏ మాత్రం గాలి, వెలుతురు జొరబడేంత కూడా గ్యాప్ లేకుండా జాయింట్ చేస్తున్నారు. ఎంతటి సమ్మర్‌లోనైనా వాతావరణంలోని వేడి కట్టడం లోపలికి వెళ్లకుండా రెండు లేయర్లలో స్టీల్ షీట్లను అమర్చుతున్నారు.
లిఫ్టులు, ఎస్కలేటర్లు..
ప్రాంగణంలోకి ప్రవేశించగానే గార్డెన్, వాటర్ ఫౌంటేన్ ఉంటాయి. మెట్ల ద్వారా కట్టడం లోపలికి వెళ్లగానే 30 అడుగుల ఎత్తులో మ్యూజికల్ ఫౌంటెయిన్ ఉంటుందని, అక్కడే కంచుతో తయారుచేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. ప్రతీ అంతస్తుకు వెల్లడానికి మెట్ల మార్గంతో పాటు లిఫ్టులు, ఎస్కలేటర్లు ఉంటాయి. సెల్లార్‌లో రెండు అంతస్తులు కేవలం వాహనాల పార్కింగ్ కోసమే కేటాయించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద స్టెయిన్‌లెస్ స్టీల్ స్ట్రక్చర్
హైదరాబాద్ నగరంలో నిర్మాణమవుతున్న అమరవీరుల స్థూపానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద స్టెయిన్‌లెస్ స్టీల్ స్ట్రక్చర్‌గా రికార్డు సృష్టించనున్నది. బ్రిటీష్ ఇండియన్ అయిన అనీశ్ కపూర్ గతంలో అమెరికాలోని చికాగోలో ‘క్లౌడ్ గేట్’ పేరుతో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో ఒక కట్టడాన్ని నిర్మించారు. దానికన్నా ఇది నాలుగు రెట్లు పెద్దది. అవసరమైనచోట్ల మాత్రమే సిమెంటు కాంక్రీటును వాడినా స్థూపం మొత్తం ఇనుప పిల్లర్లపైనే ఉండేలా డిజైన్ రూపొందింది. దానికి తగినట్లుగానే నిర్మాణం జరిగింది. కట్టడం రూఫ్ పైన ఉండే జ్యోతి (దీపం) 20 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బేస్‌మెంట్ నుంచి కట్టడం మొత్తం స్టెయిన్‌లెస్
డిజైన్ వెనక..
అమరవీరుల స్మారక స్థూపానికి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి డిజైన్ రూపొందించారు. జ్యోతిలా నిత్యం ప్రజ్వరిల్లుతూ ఉండే ఆలోచన దీపావళి పండుగ రోజున జరిగిందని రమణారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని, ప్రజల్లో ఉన్న బలమైన ఆకాంక్ష స్ఫురణకు వచ్చి వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోయేలా సింబాలిక్‌గా దీపం ఆకారాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. అన్ని మతాల్లోనూ దీపానికి ప్రత్యేకత ఉన్నదని, అమరులైనవారి మతాలు ఏవైనా వారిని స్మరించుకునేందుకు వెలుగుతూ ఉండే జ్యోతి ఆకారం సరైనదనే భావనతో దీన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. కాంక్రీటు లేకుండా ఇనుప పిల్లర్లతో, మొత్తం కట్టడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ వాడడం కూడా ఒక ప్రత్యేకత అని తెలిపారు. తెలంగాణ అమరుల త్యాగాన్ని మనం స్మరించుకునే సమయంలోనే విదేశీ పర్యాటకులకు వినూత్నంగా, ప్రత్యేకంగా ఉండేలా డిజైన్‌ను ఖరారు చేయాల్సి వచ్చిందని వివరించారు. హైదరాబాద్ నగర సందర్శనకు వచ్చినవారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక ఐకానిక్ స్ట్రక్చర్‌గా నిలుస్తుందన్నారు. ప్రపంచంలో ఇప్పటివరకూ ఇంత పెద్ద స్థాయిలో స్టెయిన్‌లెస్ స్టీల్ (క్లాడింగ్) కట్టడం లేదని, ఇదే మొదటిది అని అన్నారు. ప్రతి ప్లోర్‌కూ ఒక ప్రత్యేకత ఉన్నదని వివరించారు.
చివరి అంతస్తులో తెలంగాణ రుచులు
చివరి అంతస్తు (టెర్రాస్) 4 వేల చ.అ. విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడే చిన్న గార్డెన్, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకంగా ఉండే మొక్కలు ఉంటాయి. ఇక్కడి నుంచే దీపాకృతిలో ఉండే టవర్ అన్ని వైపుల నుంచి చూసేలా నిర్మాణమైంది. దీని కోసం ప్రత్యేకంగా ఒక స్టేజీ ఉంటుంది. దీపాకృతి చుట్టూ ఇది ఉండడంతో చుట్టూ చూడడానికి వీలవుతుంది. ఇక్కడిదాకా వచ్చిన తర్వాత వృద్ధులు, పిల్లలు సేదతీర్చుకోడానికి, కొద్దిసేపు గడపడానికి, ఫలహారం తినడానికి రెస్టారెంట్ ఉంటుంది. పూర్తిగా తెలంగాణ రుచులను అందించే ఈ రెస్టారెంట్ దగ్గరే వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి చుట్టూ కనిపించే హుస్సేన్ సాగర్, సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం,ట్యాంక్‌బండ్ తదితరాలను వీక్షించే అవకాశం ఉంటుంది.
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా మ్యూజియం
అమరవీరుల స్మారక మందిరంలోని తొలి అంతస్తులో సుమారు 25 వేల చ.అ విస్తీర్ణంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా మ్యూజియం రూపుదిద్దుకుంటున్నది. ఈ మ్యూజియంలో తెలంగాణ చరిత్ర, తొలి,-మలి దశ ఉద్యమ విశేషాలు, అమరుల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం జరిగిన వివిధ ఉద్యమ చారిత్రక ఘట్టాలు ఉంటాయి. విద్యార్థులకు చరిత్ర తెలిసే విధంగా పెయింటింగ్‌లు, ఆర్ట్ లు, ఛాయాచిత్రాలు కూడా ఉంటాయి. విదేశీ టూరిస్టులకు అర్థమయ్యేలా స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఆర్ట్, ఫొటో గ్యాలరీ సెక్షన్లు కూడా ఉంటాయి. మరోవైపు వీడియోలను వీక్షించేందుకు ప్రత్యేక ఆడిటోరియం ఉంటుంది. రెండో అంతస్తు పూర్తిగా కన్వెన్షన్ హాల్‌కే పరిమితం. ఒకేసారి సుమారు 700 మంది కూర్చునేలా నిర్మాణమైంది. అమరవీరుల సంస్మరణ కోసం మాత్రమే కేటాయించబడిన ఈ అంతస్తులో సదస్సులు, సమావేశాలు నిర్వహించుకునే అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణమైంది. మినీ థియేటర్ కూడా ఉంటుంది.