TG: ఆక్రమణలను గుర్తించేందుకు సరికొత్త టెక్నాలజీ
తెలంగాణ రాష్ట్రంలోని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చెరువులు, కుంటలు, నీటి వనరుల సంరక్షణకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చెరువులు, కుంటలు, నీటి వనరుల సంరక్షణకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పరిరక్షణ, ఫెన్సింగ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపుపై ఇప్పటికే ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైడ్రా ఏర్పడిన తర్వాత హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు రాకుండా ఉండేందుకు త్రీడీ శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్ ప్రకటించిన విషయం విదితమే. దీనికి సంబంధించిన ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు.
డ్రోన్ సర్వే..
హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3 వేలు, జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులు ఉన్నాయి. వీటిలో సగం చెరువులకు కూడా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపు పూర్తికాకపోవడంతో పాటు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయితే అన్ని చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డ్రోన్ల ద్వారా సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వేలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, పూర్తిస్థాయి నీటిమట్టం, హద్దులు గుర్తించారా? ఏమైనా నిర్మాణాలు ఉన్నాయా? అంశాలను గుర్తించాలని నిర్ణయించారు.
360 డిగ్రీలు..త్రీడీ శాటిలైట్ ఇమేజింగ్..
డ్రోన్ల సర్వే తర్వాత హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి చెరువుకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని గుర్తించడానికి త్రీడీ శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీని ద్వారా ప్రతి మూడు నెలలకొసారి త్రీడీ ఫొటోలు తీయాలా? ఆరు నెలలకొక సారి త్రీడీ ఫొటోలు తీయాలా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత చెరువులకు సంబంధించిన 360 డిగ్రీల కోణంలో చిత్రపటాన్ని పరిశీలించనున్నారు. ఆక్రమణలను శాటిలైట్ ద్వారా గుర్తించనున్నారు. ఈ పూర్తి వివరాలను హైడ్రాకు అందజేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఏజెన్సీని గుర్తించే పనిలో..
త్రీడీ శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీని అమలు చేసే బాధ్యతలను ప్రయివేటు ఏజెన్సీకి ఇవ్వనున్నారు. ఈ ఏజెన్సీని గుర్తించడానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని మహారాష్ట్రలోని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వినియోగిస్తున్నారు. అక్కడ అమలుచేస్తున్న తీరును తెలంగాణ అధికారులు అధ్యయనం చేయనున్నారు.
కట్ ఆఫ్ డేట్ ఫిక్స్..
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) పరిధిలో చెరువులు, కుంటలు, నీటి వనరుల పరిరక్షణ హైడ్రా మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటి వరకు ఆక్రమించిన భవనాలు కాకుండా భవిష్యత్‌లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు రాకుండా హైడ్రా కట్ ఆఫ్ డేట్ ఫిక్స్ చేయనుంది. హైడ్రా ప్రకటించిన డేట్ తర్వాత ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు వస్తే అందుకు అనుమతులిచ్చిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించేందుకు హైడ్రా కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లో దీనికి సంబందించి స్పష్టత వచ్చే అవకాశముందని సమాచారం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వెలిసిన నిర్మాణాలను గుర్తించడానికి హైడ్రా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలైన సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఎస్ఏ సంస్థలతో సమావేశమైన విషయం తెలిసిందే. తెలంగాణలో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో హైడ్రా ఆపరేషన్ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దివాళతీసిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. లీగల్‌గా ప్రభుత్వ ఏజెన్సీల నుంచి అనుమతులు పొందిన భవనాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హైడ్రా ప్రకటించిన విషయం తెలిసిందే.