పీఎంఏవై(ఏ) వినియోగంలో రాష్ట్రం 9వ స్థానం
పేద ప్రజల ఇండ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. కనీసం కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగించుకోవడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహించింది.
దిశ, తెలంగాణ బ్యూరో : పేద ప్రజల ఇండ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. కనీసం కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగించుకోవడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహించింది. వెరసి పేద ప్రజలకు ఇండ్లు అనేది అందని ద్రాక్షగానే మారిందంటే చేదుగా అయినా నమ్మాల్సిన నిజం. పట్టణ ప్రాంతాల్లో సొంత గూడు లేని పేద, మధ్య తరగతి ప్రజానీకానికి ఇండ్లు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్) పథకాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ, తన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కంటే వెనకబడింది. 2015 నుంచి 2023 మార్చి వరకు పూర్తయిన ఇండ్ల వివరాలను కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఇటీవల తెలిపిన గణాంకాల్లో ఈ విషయం తేటతెల్లమైంది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో పీఎంఏవై(ఏ) కింద తెలంగాణలో కేవలం 2,14,871 మాత్రమే పూర్తి చేసి, దేశవ్యాప్తంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ పథకాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, గుజరాత్, మహారాష్ట్ర వేగంగా అమలు చేసి టాప్ త్రి స్థానాల్లో నిలిచాయి.
అసలు పీఎంఏవై(అర్బన్) స్కీం ఏంటి?
ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీం(అర్బన్) ప్రధానంగా పట్టణాల్లోని ఇండ్లు లేని వారి కోసం కేంద్ర గృహ నిర్మాణ శాఖ రూపొందించింది. ఈ పథకం అమలు నాలుగు విధాలుగా ఉంటుంది. మధ్య తరగతి ప్రజానీకం తమ ఇంటిని బ్యాంక్ రుణం ద్వారా నిర్మించుకుంటే... ఆ ఇంటి నిర్మాణ ఖర్చుకు తీసుకునే బ్యాంకు రుణంకు వడ్డీ లో 25 శాతం కేంద్రం భరిస్తుంది. ఇక ఆఫర్డబుల్ హౌసింగ్ విధానం మరొకటి. దీని ప్రకారం... కేంద్రం 14 శాతం నిధులను ఇస్తే, మిగతా 86 శాతం నిధులు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసి, పేదలకు ఇండ్లు కట్టిస్తాయి. తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఈ విధానం కింద చేపట్టినవే. ఇక ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, మురికివాడల ప్రజల పునరావాసం కోసం నిర్మించే ఇండ్లు రెండు విధానాలు వేర్వేరుగా ఉంటాయి. పీఎంఏవై(ఏ) పథక నియమ నిబంధనలకు అనుగుణంగా, స్థానికంగా పథకాలు రూపొందించుకొని కేంద్రం నిధులు రాష్ట్రాలు వాడుకోవాల్సి ఉంటుంది. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో ఇండ్ల నిర్మాణ సంబంధిత అంశంలో ఇతర రాష్ట్రాల కంటే వెనుకబడిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపైనే ఎక్కుగా ఫోకస్ పెట్టడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
‘డబుల్‘ కట్టినా నిధులివ్వని పరిస్థితి
గత కేసీఆర్ ప్రభుత్వం ఆత్మగౌరవానికి ప్రతీకలుగా చెప్పుకున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం గ్రేటర్ హైదరాబాద్ లో కొంతమేర పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు ఇచ్చేందుకు సర్కారు ముందడుగు వేయడం లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం లక్ష ఇండ్లు కట్టాలని బీఆర్‌ఎస్ సర్కారు ప్రణాళికలు రచించింది. వాస్తవానికి 66,789 వేల ఇండ్లు పూర్తి చేసింది. ఇందులో 65 వేల ఇండ్లను లబ్ధిదారులకు అందజేసింది. వీటిని తెలంగాణ సర్కారు, హడ్కో సంస్థ ఇచ్చిన రూ. 8 వేల కోట్ల అప్పు.. రూ.2 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులతో నిర్మిం చింది. పీఎంఏవై రూల్స్ ప్రకారం లబ్థిదారుల జాబితా ఇంటి నిర్మాణం ప్రారంభం కంటే ముందే కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న మరొక పథకం పీఎంఏవై(రూరల్). డబుల్ బెడ్‌రూంల నిర్మాణంలో గత రాష్ట్ర ప్రభు త్వం పాటించిన కాంట్రాక్ట్ విధానం (ఇండ్లు కట్టిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేయడం) కారణంగా కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా పొందలేకపోయింది. పీఎంఏవై(రూరల్) కింద గత ప్రభుత్వ హ యాంలో రూ. 190.79 కోట్ల నిధులను కేంద్రం ఇచ్చింది. ఇంకా రూ. 168.77 కోట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఆపేసింది. దాంతోపాటు, ఇదివరకు ఇచ్చిన 190.79 కోట్లు కూడా తమకు వాపసు ఇవ్వాలనడం తో, రూ. 359.56 కోట్లు నష్టపో యినట్టు హౌసింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.