నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పేపర్ లీక్ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

టీఎస్‌పీఎస్సీ వరుస పేపర్ల లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంగా తీవ్ర దుమారం రేపుతోంది.

Update: 2023-03-18 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్సీ వరుస పేపర్ల లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. పరీక్ష పేపర్లు లీక్ అయినట్లు గుర్తించిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ఆ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో పరీక్షలు రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక, టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. టీఎస్ పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పరీక్షలు రద్దు చేయడంతో ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు కాస్త ఊరట కలిగే వార్త చెప్పారు.

పేపర్లు లీక్ అవ్వడం వల్ల అధికారులు రద్దు అయిన 4 పరీక్షలను అతి త్వరలోనే మళ్లీ నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. అంతేకాకుండా రద్దు అయిన 4 పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ ఉచితంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడతామన్నారు. అలాగే స్టడీ సెంటర్లలో రీడింగ్ రూమ్‌లను 24 గంటలు అందుబాటులో ఉంచుతామని.. ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

నిరుద్యోగ యువత ఎలాంటి ఆందోళన చెందవద్దని.. వ్యవస్థ పటిష్టంగా ఉందని అన్నారు. రాజకీయ నిరుద్యోగులు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని సూచించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవస్థలో తప్పు కాదని.. అది వ్యక్తులు చెసిన తప్పు.. వ్యక్తుల వల్ల జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..