ఎన్నికల వేళ సర్వేల జోరు.. రోజురోజుకూ మారుతున్న రాజకీయ సమీకరణాలు
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో జోరుగా సర్వేలు సాగుతున్నాయి.
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో జోరుగా సర్వేలు సాగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించాయి. అధికార పార్టీ పలుమార్లు సర్వేలు నిర్వహించడంతో పాటు ఇంటలిజెన్స్, తదితర మార్గాల ద్వారా కూడా పార్టీ పరిస్థితులు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు తదితర అంశాలపై సర్వే చేసి పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సలహాలు సూచనలు చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న ఆశావహులు సైతం తమకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్న పార్టీ, తమ బలాబలాలపై సర్వేలు చేయిస్తున్నారు. సర్వేలలో వచ్చే రిపోర్టుల ఆధారంగా టికెట్ వచ్చే అవకాశాలు ఉంటే పరిస్థితులను తమకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలి అనే అంశంపై పలువురు రాజకీయ నిపుణులతో సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యర్థుల వివరాల సేకరణ
ఎన్నికలలో తమ పరిస్థితులను అంచనా వేసుకోవడం మాత్రమే కాదు.. తమకు ప్రత్యర్ధులుగా ఎవరు ఉండబోతున్నారు.. బలాలు.. బలహీనతలు ఏమిటి అనే అంశాలను గురించి సర్వేలు చేస్తున్నారు. ప్రత్యర్థుల బలాలను ఎలా అధిగమించగలం.. తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
రోజురోజుకూ మారుతున్న పరిణామాలు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం ఉన్న పరిస్థితులకు.. ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పులు జరిగినట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఫలానా అభ్యర్థి రంగంలో ఉంటే తప్పకుండా గెలుస్తారు. అని చెప్పిన వాళ్లే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవంటున్నారు. వచ్చే ఎన్నికలలో గత ఎన్నికల మాదిరి కాకుండా హోరాహోరీగా జరిగే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనూహ్యమైన రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
సర్వేల ఆధారంగా టికెట్లు వస్తాయా..!?
అధికార బీఆర్ఎస్ పార్టీ మినహాయించి కాంగ్రెస్, బీజేపీలు గెలుపు గుర్రాలకి తమ పార్టీ టికెట్లు ఖరారు చేస్తుందని ఇప్పటికే ప్రకటించాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి ప్రభావం చూపగలరు అనుకున్న ఇద్దరూ.. ముగ్గురు అభ్యర్థులపై వివరాలను సేకరించి వారి పేర్లను పరిశీలన కోసం అధిష్టానానికి పంపిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న అభ్యర్థులకు సంబంధించి మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకునే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. గెలుపు గుర్రాలకి టికెట్టు ఇవ్వాలి అనుకుంటే సర్వేలలో మెరుగ్గా ఉన్న వారికి టికెట్ల కేటాయింపు ఉంటుంది. పైరవీలు జరిగితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని జాతీయ పార్టీకి చెందిన కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు.
Read More..
కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. 60 మందితో తొలి జాబితా..!