నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. 660 పోస్టులతో గ్రూపు-1 నోటిఫికేషన్?
గ్రూప్–1 పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. అదనంగా 30 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్–1 పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. అదనంగా 30 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది చివరి వరకు మరో 130 పోస్టులు ఖాళీ అవుతాయని తేల్చారు. ఖాళీగా ఉన్న పోస్టులకు మాత్రమే భర్తీ ప్రక్రియ చేపట్టాలా? త్వరలో ఖాళీ అయ్యే పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా? అనే అంశంపై రేపటి మంత్రివర్గంలో నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పెరగనున్న ఖాళీలు..
గతంలో గుర్తించిన 503 గ్రూప్ –1 పోస్టులకు అదనంగా ఇంకా ఏమైన ఖాళీలు ఏర్పడితే ఆ వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు, ఏడాది చివరిలో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలు విడివిడిగా ఇవ్వాలని సూచించింది. ఖాళీగా ఉన్న పోస్టులు సుమారు 30, త్వరలో ఖాళీ అయ్యే పోస్టులు సుమారు 130 ఉన్నట్లు లెక్కలు అందినట్టు తెలిసింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో 503 ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. పాత, కొత్తవాటితో కలుపుకుంటే సుమారు 660 గ్రూప్–1 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నట్టు సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి.
మళ్లీ కొత్త నోటిఫికేషన్?
పెంచిన పోస్టులను ఎలా భర్తీ చేయాలనే అంశంపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలా? పాత నోటిఫికేషన్ కు కొనసాగింపుగా సప్లమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా? అనే అంశంపై మంత్రివర్గం సమావేశం తరువాత క్లారిటీ రానుంది. అయితే గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్ లీకవడంతో పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్ కమిషన్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. తుది తీర్పు పెండింగ్ లో ఉంది. అయితే ఆ కేసును విచారించి, తీర్పు వచ్చేసరికి సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. కేసును వెనక్కి తీసుకుని కొత్తగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది.