‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. వ్యవసాయ సంచాలకుడు గోపి
ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అన్నదాతలు విధిగా ప్రోగ్రాంకు హాజరై సాగులో మెలకువలు తెలుసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు బి.గోపి కోరారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అన్నదాతలు విధిగా ప్రోగ్రాంకు హాజరై సాగులో మెలకువలు తెలుసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు బి.గోపి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో 566 రైతు వేదికలలోప్రతి మండలానికి ఒకటి చొప్పున దృశ్య, శ్రవణ పరికరాలు ఏర్పాటు చేశారు. రైతులతో నేరుగా మాట్లాడే ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించి వ్యవసాయ, అనుబంధ శాఖల కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో యాసంగి పంటలలో వచ్చే కలుపు యాజమాన్యంపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు సలహాలు, నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
పంటల సాగులో సరైన సమయానికి కలుపు యాజమాన్యం అవసరం అన్నారు. కలుపు నివారించకపోతే పురుగులు, వ్యాధుల వల్ల కలిగే పంట నష్టంతో సమానంగా దిగుబడులు ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు వివరించారు. కలుపు నివారణకు వివిధ మార్గాలు ఉన్నాయని సందర్భాన్ని బట్టి ఆయా మార్గాలను ఎన్నుకోవాలని, రసాయన మందులను ఉపయోగించే విధానంలో సరైన మందును, మోతాదును పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు వ్యవసాయ సంచాలకుడు కే.విజయకుమార్, ప్రధాన శాస్తవేత్త టి.రాంప్రకాష్, ఏ.రామకృష్ణ, బాబు, తదితరులు పాల్గొన్నారు.