గులాంగిరిని అంతం చేసిందే గులాబీ జెండా! మళ్ళీ రంగంలోకి దిగాల్సిందే! హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర విషయం పంచుకున్నారు. గులాబీ జెండాకు 24 ఏళ్ళు అని పేర్కొన్నారు. ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం, ఉదృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందన్నారు. తెలంగాణ జెండా ఎత్తిన్నాడు కేసీఆర్ వెంట పిడికెడు మంది లేరని, కానీ కేసీఆర్ ఎత్తిన పిడికిల్లకు మూడున్నర కోట్ల పిడికిల్లను జతచేసిండని, ఊరూవాడను ఏకం చేసిండన్నారు. పల్లె గల్లీ తిరుగుతూ ప్రజల మనసులు గెలిచిండన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తి చేసి ప్రజలను చైతన్యపరిచిండని పేర్కొన్నారు.
అంగబలం, అర్ధబలం కలిగిన ఆంధ్ర నాయకత్వాలను ఎదిరించి నిలబడ్డాడని, తెలంగాణ వాదాన్ని అణచివేయజూసిన ప్రతిసారి, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిండన్నారు. తన పదవులను గడ్డిపోచలుగా వదిలేసి ప్రజల్లో చర్చ బట్టి విజయాలు సాధించిండు. తెలంగాణ వాదాన్ని గెలిపించిండు. జల దృశ్యం నుంచి జన దృశ్యంగా మారిన పరిణామంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు, అణిచివేతలు, అవమానాలు అని తెలిపారు. 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కేసీఆర్ ఎన్నడూ ఎత్తిన జెండాను దించలేదని, పట్టిన పట్టును విడవలేదన్నారు. ‘ఈ బక్క మనిషితో అయితదా అన్నరు. ఈ జెండా ఉండేదా పోయేదా అన్నారు’ కానీ ఈ గులాబీ జెండానే గులాంగిరిని అంతం చేసి తెలంగాణను తెచ్చిపెట్టిందన్నారు. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి, పదేళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించిందన్నారు. ఈ ఘనత ముమ్మాటికి గులాబీ జెండాదేనని పేర్కొన్నారు.
ఆత్మగౌరవంతో బతికే జాతి తెలంగాణ జాతి. ఆత్మగౌరవం దెబ్బ తిన్నప్పుడల్లా ధిక్కార స్వరమై నిలిచిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. తెలంగాణకు నష్టం జరిగిన ప్రతిసారీ బిఆర్ఎస్ గొంతెత్తి నినదించిందని, ప్రజల పక్షాన పోరాటం చేసిందన్నారు. ఇప్పుడు మరోసారి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధమైందని వెల్లడించారు.