కాంగ్రెస్ ఆరు గ్యారంటీల చావు వార్త ఎంతో దూరంలో లేదు.. మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల చావు వార్త వినబడే రోజు ఎంతో దూరంలో లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల చావు వార్త వినబడే రోజు ఎంతో దూరంలో లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ఆయన, మాజీ మంత్రి కేటీఆర్‌లో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి 45 రోజులవుతున్నా.. ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులను గాడిన పెట్టలేకపోతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకుని తాము నెల రోజులకే సమీక్ష, సన్నాహక సమావేశాలు ప్రారంభించామని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సమావేశాల్లో నాయకులు, కార్యకర్తల నుంచి ఊహించిన దాని కన్నా ఎక్కువగా విలువైన సలహాలు, సూచనలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడామని.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు పని చేయాలని పిలుపునిచ్చారు.
సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్న ఈ కాలంలో ప్రభుత్వం మారేందుకు ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి రూ.3.5 లక్షల కోట్లు కావలన్నారు. కానీ, మన బడ్జెట్ రూ.2.90 వేల కోట్లేనని తెలిపారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుడితిలో పడిన ఎలుకలా కొట్టుకుంటుదని అన్నారు. ఒకవేళ ఆ గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించి బీజేపీ బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని, ఈ విషయంలో సంజయ్ తమపై బురదజల్లడం హస్యాస్పదమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
.