దర్యాప్తును ఆపేయండి.. ఫాంహౌజ్ ఆపరేషన్‌పై హైకోర్టు స్టే

మొయినాబాద్ ఫాంహౌజ్ ఆపరేషన్ వ్యవహారంపై దర్యాప్తు ప్రక్రియను నిలిపేయాల్సిందిగా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు దర్యాప్తు వద్దంటూ స్పష్టం చేసింది.

Update: 2022-10-29 08:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మొయినాబాద్ ఫాంహౌజ్ ఆపరేషన్ వ్యవహారంపై దర్యాప్తు ప్రక్రియను నిలిపేయాల్సిందిగా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు దర్యాప్తు వద్దంటూ స్పష్టం చేసింది. నవంబరు 4వ తేదీన తదుపరి విచారణ జరగనున్నట్లు హైకోర్టు పేర్కొన్నది. ఈ ఆపరేషన్ ఎపిసోడ్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా శనివారం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులకు మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని, పోలీసులు యధావిధిగా వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ఫామ్ హౌజ్ వ్యవహారం నడిచిందంటూ వారిలో ఒకరైన రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనితీరుపై తమకు విశ్వాసం లేదని, కేంద్ర దర్యాప్తు సంస్థగా ఉన్న సీబీఐకు అప్పగించాలని, లేదా దాని పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందా (సిట్)న్ని ఏర్పాటు చేసి సమగ్రమైన విచారణకు ఆదేశించాలని బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి మూడు రోజుల క్రితం దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు నవంబరు 4వ తేదీ వరకు తదుపరి దర్యాప్తు జరగకుండా ఆదేశాలు జారీచేసింది. మునుగోడు ఉప ఎన్నిక నవంబరు 3న ఉన్నందున ఆ మరసటి రోజున తిరిగి విచారణ జరపనున్నది. అప్పటివరకూ దర్యాప్తు ప్రక్రియకు బ్రేక్ పడింది.

Tags:    

Similar News