అర్ధరాత్రి వరంగల్‌లో గాలివాన బీభత్సం
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వరి,మామిడి,ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆరబోసిన ధాన్యం వరదపాలైంది. హన్మకొండ జిల్లాలోని హసన్‌పర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి, ధర్మసాగర్, వేలేరు, పరకాల డివిజన్‌లోని ఆరు మండలాలు, వరంగల్ జిల్లాలో నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది.జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్, బచ్చన్నపేట, లింగాలఘణపురం, జనగామ మండలాల్లో గాలివాన, వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. అనేక గ్రామాల్లో చెట్లు నేలవాలాయి. గుడిసెలు, రేకుల షెడ్లు పై కప్పులు నేలమట్టమయ్యాయి. వేలాది ఎకరాల్లోని వరి, మామడి పంటలు నాశనమయ్యాయి. అర్ధరాత్రి వర్షం కురవడంతో ఎలాంటి రక్షణ లేకుండా రైతులు రోడ్లపై ఆరబోసిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. రైతులు కన్నీటి పర్యంతమవుతూ తడిచిన ధాన్యాన్ని కుప్పగా చేర్చేందుకు యత్నించారు.
ఈ ఏడాది కాలంలోనే నాలుగు సార్లు అకాల వర్షంతో పంటలు నష్టం పోవాల్సి వచ్చిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ధాన్యం, మొక్కజొన్న, జొన్న పంటలు, మామిడి పంటలు, రాళ్లవానకు పంటలు నేలకొరిగాయని, రాళ్లవాన రైతులను కష్టాల పాలు చేసిందని వాపోయారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. మండలంలోని ఇప్పగూడెం, సముద్రాల, కోమటిగూడెం, అక్కపల్లిగూడెం తదితర గ్రామాలలో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో కోతకు వచ్చిన వరి పొలాలు నేల రాలడంతో ఆదివారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు.