ఆఫీసర్లపై సర్కారు సీరియస్..! పనితీరు మారాలంటూ సీఎం రేవంత్ వార్నింగ్

కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉన్నదా?

Update: 2024-07-06 02:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉన్నదా? ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయట్లేదనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నదా? ఇంకా బీఆర్ఎస్ లీడర్లతో టచ్‌లో ఉంటున్నారనే అనుమానం కంటిన్యూ అవుతున్నదా? ప్రభుత్వ అంశాలను ఆపార్టీ లీడర్లకు ఉద్దేశపూర్వకంగా వీరు లీక్ చేస్తున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దల్లో మాత్రం ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. సచివాలయంలో పనిచేస్తున్న కొందరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కొన్ని కీలకమైన అంశాల్లో కావాలనే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్న చర్చ ఒక సెక్షన్ ఆఫీసర్లలో జరుగుతున్నది. దీన్ని గమనించిన ఆ అధికారులు ప్రభుత్వం ఎప్పుడు ఏ యాక్షన్ తీసుకుంటుదోననే గుబులుతో ఉన్నారు.

శాఖలను లీడ్ చేయట్లేదని అసంతృప్తి

కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు తమకు అప్పగించిన శాఖలను ఆశించిన స్థాయిలో లీడ్ చేయట్లేదని ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నది. సమస్యలను పరిష్కరించాల్సిన ఆఫీసర్లే, కొత్త ప్రాబ్లమ్స్ ను క్రియేట్ చేస్తున్నారనే అసహనం నెలకొన్నది. ఏదైనా సమస్య ఏర్పడితే, వెంటనే గుర్తించి పరిష్కరించడంలో విఫలం అవుతున్నారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇంకొందరు ఆఫీసర్లు వారి సొంత ఎజెండాతో నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ ప్రాధాన్యతపై సీరియఆఫీసర్లపై సర్కారు సీరియస్..! పనితీరు మారాలంటూ సీఎం రేవంత్ వార్నింగ్స్‌గా ఉండడం లేదనే డిస్కషన్ కూడా జరుగుతున్నది. ఈ కారణంగానే సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల అన్ని శాఖల సెక్రెటరీలతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ ప్రయారిటీలను వివరించారు. వాటికి అనుగుణంగా పనిచేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆఫీసర్లపై చర్యలు తప్పవంటూ సున్నితంగా హెచ్చరించారు. దీంతో సదరు ఆఫీసర్లకు టెన్షన్ పట్టుకున్నది. ఆ శాఖలోనే కొనసాగిస్తారా? లేకుంటే తప్పిస్తారా అంటూ ఆందోళన చెందుతున్నారు.

క్రమశిక్షణపై ఫోకస్

అధికారులు, స్టాఫ్ సమయానికి ఆఫీసులకు రావట్లేదని విమర్శలు చాలా కాలంగానే ఉన్నాయి. కొందరు ఆఫీసర్లు పర్మిషన్ లేకుండానే రోజులకొద్దీ సెలవుల్లో ఉంటున్నట్లు ఇటీవల ప్రభుత్వానికి సమాచారం అందింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆఫీసుల్లో క్రమశిక్షణను తీసుకురావడంపై ఫోకస్ పెట్టింది. అటెండర్ మొదలు ఐఏఎస్ వరకు, సీఎం మొదలు సలహాదారుల వరకు అందరికీ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరి చేయాలని ఆలోచించింది. దానికి కొనసాగింపుగా పలువురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ వారివారి శాఖల పరిధిలోని ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయం 11.30 గంటలైనా ఆఫీసుకు రానివారి వివరాలను తీసుకున్నారు. ఏడాది కాలం అటెండెన్స్ వివరాలను సమర్పించాల్సిందిగా సంబంధిత హెచ్‌ఓడీలను ఆదేశించారు. సెక్రెటరీలు, హెచ్ఓడీలే నిర్లక్ష్యంగా ఉంటే ఇక కిందిస్థాయి సిబ్బందిలో డిసిప్లైన్ ఎలా ఉంటుందని మంత్రులు వ్యాఖ్యానించారు.

అధికారుల్లో గుబులు

ఈ ఆకస్మిక తనిఖీలతో అధికారులు, ఉద్యోగుల్లో గుబులు పట్టుకున్నది. మరుసటి రోజు చాలా ఆఫీసుల్లో అధికారులు, సిబ్బంది నిర్ణీత సమయానికే చేరుకున్నారు. ఆఫీసుకు ఆలస్యంగా వెళ్తే ఇబ్బందులు వస్తాయేమోనని ఆందోళన మొదలైంది. మంత్రులే స్వయంగా తనిఖీ చేస్తుండడంతో జిల్లా స్థాయిల్లో కలెక్టర్లు వివిధ డిపార్టుమెంట్లను, హాస్టళ్లను తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను పట్టించుకోకుండా, ప్రజలకు సకాలంలో సర్వీస్ చేయాలనే సీరియస్‌నెస్ లేకుండా, సమయానికి ఆఫీసుకు రాకుండా... ఇష్టారీతిన వ్యవహరించడాన్ని ప్రభుత్వం సీరియస్‌గానే తీసుకున్నది. ఇకపైన ఇలాంటి సర్ ప్రైజ్ ఇన్‌స్పెక్షన్లను తీవ్రం చేయాలని భావిస్తున్నది. అందులో భాగంగానే ప్రతి నెలా జిల్లాల టూర్ చేస్తానని, వారానికి ఒక రోజు ఫీల్డ్ విజిట్ చేస్తానని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. సెక్రెటరీలు, జిల్లా స్థాయి అధికారులు కూడా ఆఫీసులకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని నొక్కిచెప్పారు.

బడ్జెట్ సెషన్ తరువాత మళ్లీ బదిలీలు

ఇప్పటికే సెక్రెటరీలు మొదలు కలెక్టర్ల వరకు 40 మందికి పైగా ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం అవసరాన్ని బట్టి త్వరలో మరోసారి ఈ ప్రక్రియ చేపట్టాలనుకుంటున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూలై చివరి వారంలో ఉన్నందున అప్పటివరకు అధికారులకు వారి లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అప్పటికల్లా అధికారుల పనితీరును రివ్యూ చేసి ఆ తర్వాత సహకరించని, నిర్లక్ష్యంగా ఉన్న ఆఫీసర్లు, బీఆర్ఎస్ లీడర్లకు సమాచారం లీక్ చేస్తున్న అధికారులను పక్కన పెట్టాలని అనుకుంటున్నది. ఈ మధ్య జరిగిన ఐఏఎస్ బదిలీల్లో సెక్రెటేరియట్ లో పనిచేస్తున్న ఆఫీసర్లను పెద్దగా కదిలించలేదు. కానీ బడ్జెట్ సమావేశాల తరువాత మాత్రం దీర్ఘకాలంగా ఒకేశాఖలో పనిచేస్తున్న ఆఫీసర్లను ట్రాన్స్ ఫర్ చేయాలని స్పష్టమైన నిర్ణయంతో ఉన్నది. పంద్రాగస్టుకల్లా రైతుల రుణమాఫీ స్కీమ్‌ను కంప్లీట్ చేయడాన్ని ప్రైమరీ టాస్క్ గా పెట్టుకున్నందున ఆ తర్వాత పరిపాలనలో సంపూర్ణ ప్రక్షాళన చేసే అవకాశమున్నది.

అధికారుల పనితీరుతో వచ్చిన ఇబ్బందులు

  • ఏపీకి చెందిన 1800 మంది ఎంప్లాయీస్ వారి ఆప్షన్ల మేరకు ఇక్కడికి ట్రాన్స్ ఫర్ కోసం అనుమతి ఇచ్చేందుకు వివరాలతో కూడిన ఒక ఫైల్ సీఎం ఆఫీసుకు చేరింది. కొందరు సీనియర్ ఆఫీసర్లు ముఖ్యమంత్రిని మిస్ గైడ్ చేయడం వల్లే ఆ పైల్ సీఎంఓ వరకు వచ్చిందనేది ఆఫీసర్ల మధ్య జరిగిన చర్చ.
  • ఏపీ నుంచి ఇక్కడికి వచ్చేవారి సంఖ్య, ఇక్కడి నుంచి ఏపీకి వెళ్లేవారి సంఖ్యలో ఉద్దేశపూర్వకంగానే రివర్సులో చెప్పారనే అనుమానం.
  • ఈ మధ్య జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో బీఆర్ఎస్ హయాంలో కీలక శాఖల్లో పనిచేసిన ఐఏఎస్‌లకే ప్రయారిటీ దక్కడం వెనుక ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రమేయం ఉందనేది మరో చర్చ.
  • నకిలీ సీడ్ కంపెనీల ఆగడాలను కట్టడిచేయాల్సిన అధికారులే ఆ కంపెనీలకు పరోక్షంగా సహకరిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.

Similar News