మేడారంలో చివరి ఘట్టం.. పూజల అనంతరం సమ్మక్క, సారలమ్మ వెళ్లేది అక్కడికే!
నాలుగు రోజుల పాటు మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర కాసేపట్లో ముగియనుంది. చివరి పూజల అనంతరం వన దేవతలు తిరిగి అడవికి వెళ్లనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: నాలుగు రోజుల పాటు మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర కాసేపట్లో ముగియనుంది. చివరి పూజల అనంతరం వన దేవతలు తిరిగి అడవికి వెళ్లనున్నారు. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ వెళ్లనున్నారు. పునుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు వెళ్లనున్నారు. జాతర చివరి అంకానికి చేరడంతో మేడారం జనసంద్రమైంది. కాగా, మరోవైపు మేడారం జాతర గ్రాండ్ సక్సెస్ అయింది. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సారి జాతరలో భక్తులు పాల్గొన్నారు. ఒకప్పుడు గిరిజనులు మాత్రమే జరుపుకునే ఈ జాతరను.. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ విశేషంగా జరుపుకుంటున్నారు.
నిన్న(శుక్రవారం) ఒక్కరోజే ఏకంగా 50 లక్షల మంది భక్తులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాటు చేసింది. శుక్రవారం గవర్నర్ తమిళి సైతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంటికి తిరుగుముఖం పట్టడంతో మేడారం - తాడ్వాయి రోడ్డుపైన వాహనాల రద్దీ నెలకొంది. నేడు కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా వచ్చారు. మళ్లీ రెండేళ్లకు జాతర జరుగనుండటంతో ఇవాళ కూడా భారీ ఎత్తున తరలివచ్చారు.