బ్రేకింగ్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. కవితకు ఊహించని షాకిచ్చిన ఈడీ!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒక మహిళను ఈడీ ఆఫీసులో విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్ ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇదిలా ఉండగానే కవిత పిటిషన్‌కు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సుప్రీంకోర్టులో శనివారం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై తమ వాదనలు కూడా వినాలని ఈడీ పిటిషన్‌లో కోరింది.
అంతేకాకుండా కవిత కేసు విషయంలో ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని.. తమ వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఈడీ తమ పిటిషన్‌లో కోర్టును కోరింది. ఇక, ఈడీ తాజాగా కేవియట్ పిటిషన్‌తో దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు కవిత తరుఫు న్యాయవాదితో పాటు ఈడీ వాదనలు కూడా విననుంది. ఆ తర్వాతే కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇక, దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. ఈ నెల 11వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. 16వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఈడీ పిలువగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆమె 16వ తేదీన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ నెల 20వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.