Telangana Group-3: పరీక్ష రాయడానికి వెళ్లిన తల్లి.. పసిబిడ్డను ఆడించిన మహిళా కానిస్టేబుల్
తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా జరుగుతున్న గ్రూప్-3 పరీక్షలు రాసేందుకు లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా జరుగుతున్న గ్రూప్-3 పరీక్షలు రాసేందుకు లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరిలోనే కొంతమంది తల్లులు కూడా ఉన్నారు. తమ చంటిబిడ్డలను సైతం తీసుకొచ్చి పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పరీక్ష రాసేసమయంలో తమ చిన్నారులను ఎక్కడ ఉంచాలో తెలియక సతమతమవుతున్న పిల్లలకు పోలీసులు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. తల్లులు పరీక్షలు రాసి వచ్చేటంతవరకు చిన్నారుల ఆలనా-పాలనా చూసుకుంటూ వారిని ఆడిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో సోమవారం అలాంటి ఘటనే జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన కృష్ణవేణి గ్రూప్-3 పరీక్ష రాసేందుకు హైదరాబాద్ వచ్చారు. అయితే తన 6 నెలల బాబును చూసుకునేందుకు ఇంటి వద్ద ఎవ్వరూ లేకపోవడంతో తనతోపాటు చిన్నారిని కూడా తీసుకొచ్చారు. దీంతో విధులు నిర్వహిస్తున్న బషీరాబాద్ పీఎస్ మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ బాబును చేరదీసి, తల్లి పరీక్ష రాసి వచ్చేటంతవరకు జాగ్రత్తగా చూసుకున్నారు. దీంతో తోటి ఉద్యోగులు, పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులు, ఇతరులు ఆమె గొప్ప మనసును అభినందించారు.