వివాదంగా మారిన ధరణి పోర్టల్.. వరమా? శాపమా?

భూమి అంటే రైతుకు ప్రాణం కంటే ఎక్కువ. ఒకరకంగా తల్లిలెక్కనే.. భూమిని కోల్పోవాల్సి వస్తే ప్రాణం విలవిలాడుతుంది. నాగలి పట్టి దున్నిన ప్రతి రైతుకు భూమితో అనుబంధం మాటల్లో చెప్పలేనిది.

Update: 2023-06-09 07:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భూమి అంటే రైతుకు ప్రాణం కంటే ఎక్కువ. ఒకరకంగా తల్లిలెక్కనే.. భూమిని కోల్పోవాల్సి వస్తే ప్రాణం విలవిలాడుతుంది. నాగలి పట్టి దున్నిన ప్రతి రైతుకు భూమితో అనుబంధం మాటల్లో చెప్పలేనిది. అందుకే రాజులైనా, రాజ్యాలైనా ఈ భూమి కేంద్రంగానే పాలన సాగుతున్నది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే భూమి కేంద్రంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ యుద్ధం చేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లోనూ ఆ హక్కులు, సంక్షేమంపైనే ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి. అందుకు గాను వినిపిస్తున్న పదం ‘ధరణి’.. ప్రతి ఓటరు నోటా అదే మాట. ‘‘ధరణిలో అంతా బాగుంది. ధరణినే అన్ని సమస్యలకు పరిష్కారం. కాదు కాదు.. ధరణిని రద్దు చెయ్యాలి. ధరణి అంతా తప్పుల తడకే’’.. ఇప్పుడు తరచుగా వినిపిస్తున్న మాటలు. ఏది వాస్తవం? రైతుల భూమి సమస్యలు పరిష్కారం కావాలంటే ఏం చెయ్యాలి? అసలు ధరణి అంటే ఏమిటి? దశాబ్దాలుగా లేని ఈ రగడకు కారణాలేమిటి? ఎక్కడ పునాది, ఎక్కడ లోపం, ఏది పరిష్కారం? అంతకు ముందు భూ పరిపాలన లేదా? మెరుగైన వ్యవస్థ రూపకల్పనకు బదులుగా లోపభూయిష్టమైన ధరణి పోర్టల్ బాగుందని కీర్తింపులో అర్థమేంటి? మొత్తంగా ధరణి పోర్టల్​ వ్యవస్థీకృత లోపాలు రైతులకు శాపంగా మారుతున్న తరుణంలో దళారుల పంట పండుతున్నదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

రికార్డుల ప్రక్షాళన

తరతరాలుగా రెవెన్యూ, భూ పరిపాలన వ్యవస్థలు ఉన్నాయి. కాగితాల మీద నడిచే పాలనను కంప్యూటీకరించారు. అది కూడా ధరణి పోర్టల్ కంటే ముందు నుంచే ఉన్నది. అయితే అనేక తప్పులతో కూడిన రికార్డులను సీఎం కేసీఆర్ ప్రక్షాళన చేయించారు. 2017 ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా 1193 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి 9 గ్రామాలు కేటాయించారు. మూడు నెలల కాలంలోనే భూ రికార్డుల ప్రక్షాళన చేశారు. రైతులకు 1 బీ ఫారాలు ఇచ్చారు. తప్పొప్పులు ఉంటే సవరించుకోవాలని సూచించారు. ప్రతి పట్టాదారుడి ఆధార్ నంబరు అనుసంధానం చేశారు. త్వరితగతిన పూర్తి చేసిన తహశీల్దార్లు, ఆర్డీవోలకు ప్రోత్సాహకాలు, సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. విజయవంతం చేయడంలో వీఆర్వోలు కీలకభూమిక పోషించారంటూ వారిని ప్రశంసించారు. అయితే అప్పట్లో సుమారు 20 లక్షల ఖాతాలు వివాదాస్పదంగా ఉన్నాయంటూ పార్టు బీ కింద నమోదు చేశారు. కొన్ని కేసులు, భూ పంపకాలు, వివిధ రకాల వివాదాల కారణంగా పక్కన పెట్టారు. మిగతా రైతులందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. ఇదో విప్లవాత్మకంగా నిలిచింది. ఇందులో కొందరు అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలన్న తాపత్రయం, ఒత్తిడి కారణంగా అనేక పొరపాట్లు చేశారు. వాస్తవాలకు భిన్నంగా డేటాను రూపొందించారు. రంగారెడ్డి జిల్లాలో త్వరగా ఆధార్ నంబర్లు సేకరించారంటూ ఓ తహశీల్దార్ కి ప్రశంసలు కూడా దక్కాయి. అక్కడికి కొత్త తహశీల్దార్ రాగానే వందలాది ఖాతాలకు ఒకే ఆధార్ నంబర్ సీడ్ చేసినట్లుగా గుర్తించారు. రైతుల ఫిర్యాదులతో మళ్లీ సేకరించేందుకు చాలా కాలం పట్టింది. దరఖాస్తుల పరిష్కారం కంటే క్లియరెన్స్ లెక్కలనే ప్రభుత్వం ఘనంగా చూపిస్తున్నది. భూ రికార్డుల ప్రక్షాళనలోనూ అవార్డులు, రివార్డులు, సర్టిఫికెట్లు పొందిన అధికారులు పని చేసిన ప్రాంతాల్లోనూ అనేక పొరపాట్లు జరిగినట్లు దరఖాస్తుల లెక్కలే చెప్తున్నాయి.

ధరణి అంటే..

భూమి ఉన్నా రికార్డుల్లో లేకపొతే ఆ భూమిపై ఏ లబ్ధి పొందాలన్నా సాధ్యం కాదు. ప్రభుత్వ పథకాలు అందవు. పంటల బీమా దక్కదు. ఎలాంటి లావాదేవీలు కుదరవు. భూమి వాస్తవ యజమాని పేరే రికార్డుల్లో ఉండాలి. ఆ వ్యక్తికే ప్రభుత్వం ఇచ్చే యాజమాన్య హక్కుపత్రం ఉండాలి. భూమిపై హక్కులు వచ్చిన వెంటనే రికార్డుల్లో మారే విధానం ఉండాలి. ఒకప్పుడు భూమి రికార్డులన్నీ కాగితాలపైనే. భూమి హక్కులు వచ్చిన తరువాత రికార్డుకు ఎక్కడానికి నెలలు, సంవత్సరాలు పట్టేది. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని 1980 నుంచే భూ రికార్డుల కంప్యూటీకరణ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. కాగితాలు కంప్యూటరు ఎక్కించడమే కాదు. ఆ రికార్డే హక్కుల నిరూపణకు అంతిమ సాక్ష్యంగా ఉండాలి. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలోని 'వెబ్‌ ల్యాండ్‌' పోర్టల్‌ వచ్చింది. అదే తెలంగాణ రాష్ట్రంలో 'మా భూమి' పోర్టల్‌ గా కొనసాగింది. రికార్డులైతే కంప్యూటర్‌ కు ఎక్కాయి. కానీ అందులో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి. భూమి ఒకరిదైతే రికార్డుల్లో ఇంకెవరో ఉంది. ఈ పరిస్థితిని సరి చేయడానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. రికార్డులను సరిచేసి రైతులకు కొత్త పట్టాదారు పానుపుస్తకాలను అందించింది. ఈ సరిచేసిన రికార్డులను "ధరణి" పోర్టల్ లో నమోదు చేశారు.

డేటా.. ప్రామాణికత

భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత డేటా పర్ఫెక్ట్‌గా ఉండాలి. కానీ ధరణి పోర్టల్ లో అప్ లోడ్ చేసిన డేటాతో అనేక చిక్కులు వచ్చాయి. పట్టాదార్లు మారారు. విస్తీర్ణం, భూమి స్వభావం, సర్వే నంబర్లు.. ఇలా ఒక్కటేమిటి.. అనేక రకాల పొరపాట్లు చోటు చేసుకున్నాయి. ఇంతకీ ఏ డేటాని ప్రామాణికంగా తీసుకున్నారన్న విషయంలో అధికారుల నుంచి స్పష్టత లేదు. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన లక్షలాది మంది భూమి హక్కులు కోల్పోయారు. దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూముల రక్షణ పేరిట ఆటోలాక్ చేయాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. వాటికి బదులుగా ఆయా సర్వే నంబర్లలోని మొత్తం భూమిపై ఆటోలాక్ వేశారు. ఖాస్రా పహాణీలోని భూమి స్వభావం సర్కారీ ఉందంటూ 2022లో నిర్దారించారు. అయితే 60, 70 ఏండ్లుగా అనేక లావాదేవీలు చోటు చేసుకున్నాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కొందరు కలెక్టర్లు ఔదార్యం ప్రదర్శిస్తే ఇంకొందరేమో కఠినంగా వ్యవహరించారు. వీటిపై సరైన మార్గదర్శకాలు రూపొందించకపోవడంతో తెలంగాణలో చోటు చేసుకున్న భూమి పంపిణీ, పట్టాల పంపిణీ వంటి అనేకాంశాలను కలెక్టర్లు అర్ధం చేసుకోకుండా ససేమిరా అంటున్నారు. కోర్టుకు వెళ్లాలంటూ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి సరి చేయాల్సిన రికార్డులను కోర్టుల్లో తేల్చుకోవాలంటూ లిఖితపూర్వకంగా రాసిస్తుండడం ధరణి పోర్టల్ వైఫల్యంగా కనిపిస్తున్నది.

ఆప్షన్లతోనే గుట్టురట్టు

ధరణి పోర్టల్ పవిత్ర గ్రంథంగా ప్రచారం చేస్తున్నారు. 99 శాతం బాగుందంటూ సీఎం కేసీఆర్ కీర్తిస్తున్నారు. అదే నిజమైతే ధరణి పోర్టల్ లో సమస్యల పరిష్కారానికి 33 మాడ్యూళ్లను ఎందుకు తీసుకొచ్చారు? ఒక్క శాతం తప్పులకు అన్నేసి మాడ్యూళ్ల అవసరం ఏమిటి? దీన్ని బట్టి ఎన్నిరకాల సమస్యలను రెవెన్యూ డేటా సృష్టించిందో తెలుస్తుంది. ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు వచ్చాయి. ఇంకా వేల సంఖ్యలో పెండింగులో ఉన్నాయి. పలు సమస్యల పరిష్కారానికి ఆప్షన్లు లేవు.

అప్పీల్ వ్యవస్థ ఏది?

ఏ సమస్య వచ్చినా ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. తిరస్కరిస్తే అప్పీల్ కి వెళ్లే వ్యవస్థ లేదు. ఇదే సామాన్య రైతుకు తీవ్ర విఘాతం కలిగిస్తోన్న అంశం. తహశీల్దార్ దగ్గర న్యాయం దొరక్కపోతే ఆర్డీవో, అక్కడా లభించలేదనిపిస్తే జాయింట్ కలెక్టర్ వరకు పైసా ఖర్చు లేకుండా వెళ్లేవారు. ఇప్పుడా వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. రికార్డుల ప్రక్షాళన చేశాం.. అంతా కరెక్టుగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యవస్థే అవసరం లేదన్న ప్రభుత్వ వాదనతో ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య రైతు కూడా కలెక్టరేట్ కి రావాల్సిన దుస్థితి నెలకొన్నది. ధరణి డేటా సవరణకు, పార్టు బి సమస్యల పరిష్కారానికి కొన్ని నెలల పాటు రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు. అప్పటి దాకా పెండింగులోని వేలాది కేసులను పరిష్కరించకుండా క్లియర్ చేశారు. కోర్టుకు వెళ్లాలంటూ సూచించిన దరఖాస్తులే అధికం. దాంతో పార్టు బి, ఇతర పెండింగు దరఖాస్తుల పరిష్కారానికి కోర్టులను ఆశ్రయించాలన్న ప్రభుత్వ వాదన రైతులకు ఆర్ధిక భారాన్ని మోపింది.

వీఆర్వో వ్యవస్థ రద్దుతో ఇబ్బందులు

భూమి ఉన్నంత కాలం ఏదో ఒక రకమైన సమస్యలు వస్తుంటాయి. వాటిని గ్రామ స్థాయిలోనే పరిష్కరించే వ్యవస్థ అనివార్యం. దేశ వ్యాప్తంగా వీఆర్వో వ్యవస్థ ఏదో ఒక రూపంలో అమలవుతున్నది. ఆఖరికి మన కంటే మెరుగైన డేటాను రూపొందించుకున్న ఆంధ్రప్రదేశ్, కర్నాటకలోనూ గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఇక్కడ మాత్రం వీఆర్వోలు అవినీతికి పాల్పడుతున్నారంటూ ముద్ర వేసి, రెవెన్యూ రికార్డులన్నీ కంప్యూటీకరణ చేసిన తర్వాత వారి అవసరమే లేదంటూ వ్యవస్థను రద్దు చేశారు. కొందరు వీఆర్వోలు అవినీతి, అక్రమాలు పాల్పడిన మాట వాస్తవమే. కానీ కాలికి పుండయితే ఆ కాలు మొత్తాన్నే కొట్టేసినట్లుగా వ్యవస్థను రద్దు చేశారన్న విమర్శ కేసీఆర్ సర్కార్ పై ఉన్నది. ఇప్పుడేం రైతుకు తక్కువ ఖర్చుతో న్యాయం దక్కడం లేదు. గ్రామ స్థాయిలో పూర్తయ్యే పనికి హైదరాబాద్ దాకా రావాల్సి వస్తున్నది. అది కూడా లెక్క లేనన్ని సార్లు తిరగాల్సి వస్తున్నది.

అనుభవదారు కాలమ్?

రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల్లో నుంచి అనుభవదారు కాలమ్ ఎత్తేశారు. నిజానికి ఇప్పుడు కూడా ఉన్నది. కానీ అంతకు ముందున్న పేర్లున్న చోట పట్టాదారుడి పేరే రాశారు. దీని ద్వారా సుమారు 18 లక్షల ఎకరాలు పెద్దోళ్ల పేరిట మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ లెక్కను ప్రభుత్వం కూడా దాచిపెడుతున్నది. ఆఖరికి సమాచార హక్కు చట్టం కింద అనుభవదారు కాలమ్ కింద ఎంత మంది కౌలుదార్లు ఉన్నారు? విస్తీర్ణం ఎంత? ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు ఉన్నది? అన్న వివరాలు ఇవ్వాలని అడిగి ఏడాది గడిచినా రిప్లై ఇవ్వడం లేదు. చాలా గ్రామాల్లో దళిత, బహుజనులే దొరలు, భూస్వాములు, దేశ్ ముఖ్ ల భూములను దున్నుకుంటున్నారు. అనుభవదారు కాలమ్ లో వారి పేర్లు మాత్రం కొన్ని దశాబ్దాలుగా రాశారు. ధరణి పోర్టల్ రాగానే వారి పేర్లను తొలగించారు. కౌలుదార్లతో తమకేం సంబంధం లేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనూ ప్రకటించారు. దీని ద్వారా ఎంతో మంది పేదలు దున్నుకుంటున్న భూములపై హక్కులను కోల్పోయారు.

సమస్యలు ఎన్నెన్నో..

- పాత పట్టాదారు పాసుపుస్తకం, భూయాజమాన్య హక్కు పత్రం ఉంది. కానీ కొత్త పాసుపుస్తకం రాలేదు.

- సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమికి పాసుపుస్తకం రాలేదు. ఓ.ఆర్‌.సి ఉన్నా పాసుపుస్తకం రాలేదు.

- లావోని పట్టా ఉంది. 38ఈ సర్టిఫికెట్‌ ఉన్నా పాసుపుస్తకం రాలేదు.

- వ్యవసాయ భూమి 'నాలా' అని నమోదు అయ్యింది. పాసుపుస్తకం రాలేదు.

- పట్టా భూమిని అసైన్‌ / ప్రభుత్వ / సీలింగ్‌ / వక్స్‌ / దేవాదాయ భూమి అని నిషేదిత జాబితాలో చేర్చారు.

- ఒక సర్వే నంబర్‌ లో కొంత అసైన్స్‌ / ప్రభుత్వ / సీలింగ్‌ / 35) / దేవాదాయ భూమి ఉంది. ఆ సర్వే నంబర్‌ లో మొత్తం భూమిని నిషేదిత జాబితాలో చేర్చారు.

- కోర్టు ఉత్తర్వులు లేకున్నా పట్టా భూమిని నిషేదిత జాబితాలో చేర్చారు.

- మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ కోసం కోసం స్లాట్‌ బుక్‌ చేసుకొని, అనివార్య కారణాలతో రద్దు చేసుకుంటే కట్టిన ఫీజు తిరిగి ఇవ్వడం లేదు.

- భూమి స్వభావం తప్పుగా నమోదు అయ్యింది.

- ధరణిలో సవరణల కోసం, దరఖాస్తుల పరిస్కారానికి ఎలాంటి కాల పరిమితి లేకపోవడం వల్ల దీర్షకాలం అపరిష్కృతంగానే ఉంటున్నాయి.

- ఎలాంటి కారణాలు చెప్పకుండానే దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు.

- ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి కొనుగోలు చేసినా భూమికి విడిగా పాసుపుస్తకం పొందటానికి అవకాశం లేదు.

- పట్టాదారు చనిపోయిన తరువాత ఇతర వారసులకు తెలియకుండానే ఒక వారసుని పేరుమీద పట్టా మారుతుంది.

- భూ యాజమానికి తెలియకుండానే ధరణిలో మార్పులు జరుగుతున్నాయి.

లీఫ్స్ సంస్థ పరిష్కార మార్గాలివి

- ధరణి సమస్యల పరిస్కారానికి చేసుకోవడానికి పోర్టల్‌ లో మాడ్యూళ్లను ఏర్పాటు చెయ్యాలి

- ధరణి రికార్డుని ప్రింట్‌ తిసి ప్రతి గ్రామానికి పంపాలి. ప్రజల భాగస్వామ్యంతో సర్వే నంబర్ల వారీగా సమస్యలను గుర్తించాలి.

- గ్రామ రెవెన్యూ కోర్టు, సదస్సులను నిర్వహించి సమస్యలను పరిష్కరించాలి. సరి చేసిన రికార్డును ధరణి కి ఎక్కించాలి.

- ధరణి, ఇతర భూ సమస్యల పరిస్కారానికి జిల్లాకొక శాశ్వత భూమి ట్రిబ్యునల్ ని ఏర్పాటు చెయ్యాలి.

- ధరణిలో తప్పులు సరి చెయ్యడానికి ఆర్‌.ఓ.ఆర్‌. చట్టాన్ని సవరించాలి.

- అవినీతికి తావులేకుండా చూడాలి. రికార్డుల్లో భూ యజమానికి తెలియకుండా ఎలాంటి మార్పు జరిగే వీలు లేకుండా చేయాలి.

సమస్యల పరిష్కారం భారమే

ధరణిలో చాలా వివరాలు తప్పుగా నమోదయ్యాయి. ఒక అంచనా ప్రకారం ప్రతి ఊరిలో వంద మందికి పైగా రైతులకు సంబంధించిన భూమి వివరాలు ధరణిలో సరిగా నమోదు కాలేదు. ధరణిలో దాదాపు 45 రకాల సమస్యలు ఉన్నాయి. ధరణి సమస్యల పరిస్కారం క్లిష్టంగా, రైతులకు భారంగా మారింది. భూరికార్డుల సమస్యలు తీరాలంటే భూముల రీ సర్వే చేసి కొత్త రికార్డులను రూపొందించుకోవడం సమస్యకు సమగ్ర, శాశ్వత పరిస్కారం. ఈ లోపు ప్రజల భాగస్వామ్యంతో ధరణిలో ఉన్న తప్పులను గుర్తించి గ్రామాల్లో సదస్సులు / కోర్టులు నిర్వహించి రికార్డులను సరిచేయాలి. టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలి. ఈ రోజు ధరణి ఉంది. రేపు ఇది కొనసాగవచ్చు లేదా ఇంకోటి రావొచ్చు. ఏది ఉన్నా పైన చెప్పినవి చేస్తేనే సమస్యలు తీరతాయి . భూరికార్డుల కంప్యూటరీకరణలో గడిచిన నాలుగు దశాబ్దాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏం చెయ్యాలో అందరు ఆలోచన చెయ్యాలి.

= ఎం.సునీల్ కుమార్

రెవెన్యూ చట్టాల నిపుణులు

నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్

Read More...   బడ్జెట్​లేక మూలనపడ్డ సంక్షేమం.. దళితబంధు ఎంపికలో అంతా దగే!

Tags:    

Similar News