మిగిలిన కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించండి.. రాష్ట్ర గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్

రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్లను ఇటీవల రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Update: 2023-08-07 16:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్లను ఇటీవల రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీని వల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరింది. అయితే వారితో పాటు దాదాపు 1020 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులరైజ్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో వారిని కూడా క్రమబద్ధీకరించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో దాదాపు 450 మంది, డిగ్రీ కాలేజీల్లో సుమారు 570 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారని వారు వినతిలో పేర్కొన్నారు. డిగ్రీ కాలేజీల్లో పనిచేసేందుకు వాస్తవానికి నెట్, సెట్, పీహెచ్ డీ ఉండాలనేది నిబంధన. కానీ గతంలో తీసుకున్న సమయంలో 570 మందికి దీనికి ఈ అర్హతలు లేకపోవడంతో వీరిని క్రమబద్ధీకరించకలేదు.

కానీ ఎన్నో ఏండ్లుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నేపథ్యంలో వారిని కూడా క్రమబద్ధీకరించాలని కోరారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ లెక్చరర్స్ గా కొనసాగుతూ అర్ధాంతరంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశం కల్పించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, మల్లారెడ్డి, పోల్కంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తిరుపతిరెడ్డి, మనోహర్, రజిత, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News