Harish Rao: ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి.. హరీష్ రావు డిమాండ్

మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, ముఖ్యమంత్రి వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

Update: 2024-07-31 09:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, ముఖ్యమంత్రి వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా.. నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానం అంటూ.. ముఖ్యమంత్రి గారు వెంటనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని చెప్పారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయమని మండిపడ్డారు.

అంతేగాక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్పా.?, రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల మరణాలు, ఆటో కార్మికుల బలవన్మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీడయడమే మేము చేసిన తప్పా.?, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పట్ల అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తడమే మేము చేస్తున్న తప్పా.? అని పలు ప్రశ్నలు సంధించారు. ఇక మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని, కాంగ్రెస్ చేస్తున్న ఒక్కో తప్పును లెక్కబెడుతున్నారని హరీష్ రావు ఎక్స్ రాసుకొచ్చారు. కాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలారని, ఆ అక్కల మాటలు వింటే.. కేటీఆర్ జూబిలీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తది అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News