టీఎస్పీఎస్సీ అంశంపై బీజేపీ పోరు.. త్వరలో రాష్ట్రపతికి నివేదిక

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ తన పోరును మరింత ఉధృతం చేయనుంది. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించిన కమలదళం ఇప్పుడు కోటి సంతకాల సేకరణ చేపట్టాలని భావిస్తోంది.

Update: 2023-04-09 02:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ తన పోరును మరింత ఉధృతం చేయనుంది. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించిన కమలదళం ఇప్పుడు కోటి సంతకాల సేకరణ చేపట్టాలని భావిస్తోంది. ఈ ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించనుంది. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లకు బీజేవైఎం నేతలు వెళ్లనున్నారు.

నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం లీకేజీ పై స్పందించిన తీరును వివరించనున్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాడేది తాము మాత్రమేనని, జైలుకు కూడా వెళ్లామనే అంశాన్ని బలంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. కోటి సంతకాల సేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఈ అంశంపై రాష్ట్రపతికి సైతం నివేదికలు అందించనున్నారు.

యూనివర్సిటీల్లో పర్యటన..

టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ అంశంలో ఇప్పటికే బీజేపీ నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీ వర్సిటీల పర్యటనలు చేస్తుంది. ఈ క్రమంలో కోటి సంతకాల సేకరణను బీజేవైఎం నేతలు చేపట్టనున్నారు. పనిని విభజించుకుని నిత్యం జనంలో ఉండాలని పార్టీ భావిస్తోంది. అంతేకాకుండా అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? బలిదానాలు చేసుకున్నది ఎందుకనే విషయాన్ని వారకి వివరించాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణ వస్తే నోటిఫికేషన్లు వస్తాయి, జీవితాలు బాగుపడుతాయని భావించిన యువతకు స్వరాష్ట్రంలోనూ నిరాశే ఎదురైందనే విషయాన్ని వివరించేలా కార్యాచరణను బీజేవైఎం రూపొందించుకుంది.

ఉద్యోగాల భర్తీపైనా..

తెలంగాణలో 1.92 లక్షల ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిషన్ స్పష్టం చేసినా ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని? అనే విషయాన్ని నిరుద్యోగులకు వివరించనున్నారు. ఖాళీలు భర్తీ చేయకపోగా ప్రశ్న పత్రాలు లీకేజీ చేయడాన్ని బీజేపీ సీరియస్ గా ఉంది. సోమవారం నుంచి వర్సిటీల వారీగా, కాలేజీల వారీగా, కోచింగ్ సెంటర్ల వారీగా పలు బృందాలు పర్యటించనున్నాయి. నిరుద్యోగ సమస్యపై బీజేపీ చేపడుతున్న కోటి సంతకాల సేకరణతో బీఆర్ఎస్ కు చెక్ పెట్టగలదా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News