‘మాకే ఓటేయండి’.. ఓటర్లకు మూడు పార్టీల అగ్రనేతల నేతల విజ్ఞప్తి..!
లోక్‌సభ ఎన్నికలకు ఈసారి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత ఏర్పడింది. ముక్కోణపు పోటీతో మూడు పార్టీల అధినేతలు రంగంలోకి
దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు ఈసారి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత ఏర్పడింది. ముక్కోణపు పోటీతో మూడు పార్టీల అధినేతలు రంగంలోకి దిగారు. బీజేపీ తరఫున ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. చివరి వారంలో ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, పలువురు సీనియర్ నేతలు రాష్ట్రానికి వచ్చి క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ తరఫున అధినేత కేసీఆర్ ఏకంగా 16 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు నియోజకవర్గాల్లో రోడ్ షో, స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు. ఇదంతా ఒక ఎత్తియితే ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు, మేధావుల సంఘాలు రాష్ట్రమంతా ఓటర్ల చైతన్య యాత్ర నిర్వహించి బీజేపీని ఓడించాలని అన్ని నియోజకర్గాల్లో అవగాహన కల్పించారు.
ప్రతీ పార్టీ అధినేత తమ పార్టీకే ఎందుకు ఓటు వేయాలో, ఇతర పార్టీకి ఎందుకు వేయొద్దో స్పష్టమైన మెసేజ్‌లను జనంలోకి తీసుకెళ్ళారు. కేంద్రంలో గత పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాలను, ప్రధానిగా మోడీ అవలంబించిన విధానాలు, రాష్ట్రానికి సహాయ సహకారాలను ఇవ్వకపోవడం, రాష్ట్రంలో కేసీఆర్ పాలనలోని ఫెయిల్యూర్స్, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలు.. వీటన్నింటినీ కాంగ్రెస్ నాయకులు ఏకరువు పెట్టారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాల అమలు.. వీటిని ప్రజలకు వివరించి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆదరించాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడమే పరమావధిగా అలవికాని హామీలు ఇచ్చి మోసం చేసిందంటూ బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు విమర్శించారు.
రిజర్వేషన్లతో సామాజిక న్యాయం: రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్
“రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చొరవతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు దక్కి నేడు అనేక స్థాయిల్లోకి ఎదిగారు. కానీ రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లు లేని దేశంగా మార్చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాను అమలు చేయాలని భావిస్తున్నది. ప్రపంచ దేశాలతో పోటీపడాల్సిన భారత్ ఇప్పుడు బీజేపీ కుట్రలకు బలి అవుతున్నది. అందుకే ప్రజలు వారి హక్కుల కోసం, దేశంలో ప్రజాస్వామ్యం కోసం ‘ఇండియా’ కూటమిని గెలిపించండి. తద్వారా కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచడానికి వీలు కలుగుతుంది” అని సీఎం రేవంత్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
దేశ అభివృద్ధి, రక్షణకు బీజేపీ గ్యారంటీ: కిషన్‌రెడ్డి, బీజేపీ
“తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉన్నది. రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. సహకార సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల పురోగతి బీజేపీతోనే సాధ్యం. మా పార్టీ దేశ అభివృద్ధి, రక్షణ, దేశ భవిష్యత్తుతో పాటు ప్రజల ఎదుగుదల కోసం అంకితభావంతో పనిచేస్తుంది. అవినీతి రహిత పాలనతో ఉగ్రవాదం లేని భారత్‌గా తీర్చిదిద్దుతుంది. ప్రపంచంలో భారత్ గౌరవాన్ని పెంచడానికి మోడీ నాయకత్వం అవసరం. పేదవారి ఇండ్లలో మరుగుదొడ్ల నిర్మాణం మొదలు దేశానికి అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించి చంద్రయాన్‌తో అంతర్జాతీయ స్థాయిలో సముచిత స్థానం దక్కింది. మాకు తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ రావడం ఖాయం. ఇప్పటికే మేం సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉన్నాం” అని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
నాకు తెలంగాణ ప్రజలకు మధ్య బాండింగ్: కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
“ఈసారి రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగానే ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం. ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీ క్యూ కట్టయే పరిస్థితులు రాబోతున్నాయి. ఎన్నికల తర్వాత ప్రాంతీయ శక్తుల ఐక్యతను పెంచే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో మాకు 12-14 సీట్లు వచ్చే అవకాశమున్నది. తొమ్మిదిచోట్ల కాంగ్రెస్‌కు థర్డ్ ప్లేస్. బీజేపీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నా మాకు చాలా దూరంగా ఉన్నది. తెలంగాణకు, కేసీఆర్‌కు మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉన్నది. పదవులను, రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడాను. ప్రజలకు కూడా ఇది తెలుసు. పదేండ్ల మా పాలనలో ప్రజలు అనుభవించిన ఫలాలు వారి కండ్ల ముందు ఉన్నాయి” అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.