శృతి మించిన టీఆర్ఎస్ నేతల ఆగడాలు.. మరీ ఇంత దారుణమా!

అధికార పార్టీ అనుబంధ ఆటో యూనియన్ నాయకుల అరాచకాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. మంత్రి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ.. ఆటో నడిపే కార్మికులపై జులుం ప్రదర్శిస్తున్నారు.

Update: 2022-10-22 11:38 GMT

అధికార పార్టీ అనుబంధ ఆటో యూనియన్ నాయకుల అరాచకాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. మంత్రి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ.. ఆటో నడిపే కార్మికులపై జులుం ప్రదర్శిస్తున్నారు. వివిధ సందర్భాల్లో జరిగే కార్యక్రమాలకు ఆటోవాలాలు హాజరు కావాలని లేకుంటే జరిమానా విధింపు తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు అడ్డా మీద ఆటో నడిపేందుకు వీలు లేదని హూంకరిస్తున్నారు. తాజాగా యూనియన్ అధ్యక్షుని పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమానికి హాజరుకావాలని, లేనియెడల ఒక్కొక్కరికి రూ.300 ఫైన్ విధిస్తామంటూ ఏకంగా బోర్డు మీద రాసి పెట్టడం వీరి వింత పోకడకు నిదర్శనంగా మారింది. వీరి వ్యవహారశైలితో ఆటో నడిపి పూట గడుపుకునే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, ఖమ్మం బ్యూరో: అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం నేత ఓ ఆటోవాలాపై ప్రదర్శించిన తీరు వారి అరాచకాలకు అద్దం పడుతోంది.. అంతేకాదు.. 'మా అన్న ఎంత చెబితే మంత్రికి అంత.. మా దగ్గర 4000 కుటుంబాలు.. 12 వేల ఓట్లు ఉన్నాయంటూ..' బెదిరింపులకు పాల్పడడం చూస్తే వారి బరితెగింపు ఏపాటిదో అర్థం అవుతోంది.. ఇటీవల మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వచ్చిన సందర్భంగా అనారోగ్యంతో ర్యాలీలో పాల్గొనని ఓ ఆటో కార్మికుడిని కార్మిక సంఘం అధ్యక్షుడి పేరుతో ఆయన అనుచరులు.. అడ్డాకు చెందిన నేత 15 రోజులు అతని ఆటో తిరగనివ్వలేదు.. అంతేకాదు.. జరిమానా కట్టాలంటూ వేధించారు.. అతనిపై దాడికి సైతం దిగినట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..

ఇటీవల మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వచ్చిన సందర్భంగా అధికార పార్టీకి చెందిన కార్మిక సంఘం నుంచి ఆటోవాలాలు అందరూ ర్యాలీకి రావాల్సిందిగా ఆదేశాలు అందాయి. అయితే ముష్టికుంటకు చెందిన ఓ ఆటో డ్రైవర్ అనారోగ్యంతో ర్యాలీకి వెళ్లలేకపోయాడు. దీంతో ఆగ్రహించిన సందరు ఆటో అడ్డా ప్రెసిడెంట్ ఆటో డ్రైవర్ కు రూ.500 జరిమానాతో పాటు 15 రోజులు ఆటో నడపకూడదంటూ హుకుం జారీ చేశాడు. అయితే సదరు ఆటో డ్రైవర్ 15రోజులు ఇంటి వద్దే ఉండి 16వ రోజు ఆటో తీసుకుని అడ్డా మీదకు వెళ్లాడు.. అదే రోజు అడ్డా ప్రెసిడెంట్ రాకపోవడంతో జరిమానా తర్వాత రోజు చెల్లించేందుకు సిద్ధ పడ్డాడు. తర్వాత రోజు జరిమానా చెల్లించేందుకు వెళ్లగా మరో రూ.500 ఫైన్ తో పాటు.. మరో 15 రోజులు ఆటో నడపకూడదంటూ అడ్డా ప్రెసిడెంట్ మళ్లీ చెప్పడంతో బాధితుడు మేం ఎలా బతకాలంటూ ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన అడ్డా ప్రెసిడెంట్ ఆయన అనుచరులు బూతులు తిడుతూ డ్రైవర్‌పై దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాలు పోలీస్ స్టేషనకు వెళ్లారు.

మా అన్న ఎంత చెబితే మంత్రికి అంత..

పోలీస్ స్టేషన్‌కు ఇరు వర్గాలు వెళ్లగా ఆటో అడ్డా ప్రెసిడెంట్.. ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్లోనే 'మా అన్న ఎంత చెబితే మంత్రికి అంత.. మా దగ్గర 12 వేల ఓట్లు ఉన్నాయి.. మేం చెప్పిందే వినాలంటూ'ఖమ్మం నగరంలోని ఓ ఎస్సైతో అనగా.. ఆయన బయట కాంప్రమైజ్ కావాల్సిందిగా సూచించాడు. దీంతో ఇరువర్గాల మధ్య పంచాయితీ కార్మిక సంఘం నేత వద్దకు వెళ్లింది.. ఇలా రెండు వర్గాలను సదరు నేత కాంప్రమైజ్ చేసి పంపినట్లగా సమాచారం. మంత్రి పేరు చెబుతూ.. ఆయన అనుచరుల పేరు చెబుతూ కొందరు చేస్తున్న అరాచకంపై నగరం ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

మరీ ఇంత దారుణమా..

ఇదే విషయమై 'దిశ ప్రతినిధి'కి బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు.. అధికార పార్టీకి చెందిన అనుబంధ సంస్థ కాబట్టి కేటీఆర్ ర్యాలీకి ఆటోవాలాలందర్ని రావాల్సిందిగా ఆర్డర్ వేశారని, కానీ అనారోగ్యం కారణంగా వెళ్లలేపోతే ఇంత పనిచేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 15 రోజులు ఆటోని తిరగనివ్వలేదని.. రూ.500 ఫైన్ వేసినా కట్టేందుకు సిద్ధపడి.. ఆ 15రోజులు ఏ పనిలేక ఇంట్లోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు.. అయినా మరో 15 రోజులు రూ.500ఫైన్ విధిస్తే మేం ఎలా బతకాలంటే వాపోయాడు.. మా కుటుంబం పరిస్థితి ఏం కావాలంటూ ప్రశ్నించాడు.. కొంతమంది మంత్రి పేరు చెప్పి.. వారి అనుచరుల పేరు చెప్పి చేస్తున్న అరాచకాల అన్నీ ఇన్నీ కావంటూ బాధపడ్డాడు. అయితే ఇలాంటి ఘటనలు చాలానే జరిగినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన వారవడంతో బయటకు రావట్లేదని తెలుస్తోంది.

తాజాగా పుట్టినరోజంటూ..

శనివారం ఆ యూనియన్ అధ్యక్షుడు పాల్వంచ కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఆయన ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించాలని యూనియన్ నాయకులకు సమాచారం అందింది. దీంతో యూనియన్ నాయకులు ఆయా అడ్డాల్లో ఉన్న బ్లాక్ బోర్డులపై ఆటో కార్మికులు అందరూ శనివారం ఉదయం 9 గంటలకు అడ్డా వద్ద హాజరుకావాలని, పాల్వంచ కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలని కోరారు. హాజరు కాని కార్మికులకు రూ. 300 ఫైన్ విధించబడునని మొదట అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అప్పటికే కొన్ని ఆటోలు కిరాయికి వెళ్లడం, మరికొందరు ఇంటికి వెళ్లడంతో అందరికీ సమాచారం వెళ్లలేక.. కొందరు మాత్రమే బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. మరికొందరు హాజరుకాలేకపోయారు. దీంతో ఆగ్రహించిన యూనియన్ నాయకులు.. హాజరుకాని ఆటో కార్మికుల పేర్లు బోర్డు మీద రాసి రూ.500 ఫైన్ కట్టి తర్వాత మాత్రమే అడ్డాపై ఆటోలు పెట్టుకోవాలని సూచించడం విచిత్రం. దీంతో పలువురు కార్మికులు నాయకులతో ఘర్షణకు కూడా దిగినట్లు సమాచారం. పుట్టినరోజు వేడుకలకు ఇష్టం ఉంటే వస్తామని, పనులు వదిలేసి రామ్మంటే ఎలా అంటూ నిష్టూర్చారు. బలవంతం చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. అధ్యక్షుని ఆదేశాల మేరకు యూనియన్ నాయకులు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. రోజంతా కష్టపడితే కుటుంబం గడవడం కష్టంగా మారిన ఈ పరిస్థితుల్లో ఒత్తిడి చేసి జరిమానాల పేరిట వసూళ్లకు పాల్పడటం ఎంత వరకు సమంజమని పలువురు కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News