తన మనువడు బాధపడ్డా కేసీఆర్ కు మాత్రం సోయి లేదు.. ఏఐఎస్ఎఫ్ నేతల ఫైర్

Update: 2023-07-13 14:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గౌలిదొడ్డి లోనీ కేశవ నగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలనీ చూస్తే కన్నీళ్లు వచ్చాయని పాఠశాలలో ఉన్న సమస్యలను చూసి ముఖ్యమంత్రి మనువడు బాధపడ్డా కేసీఆర్ కు మాత్రం సోయి లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ లు విమర్శించారు. ఆ పాఠశాలలో పరిస్థితులు బాగా లేదని అందుకే దత్తత తీసుకొని అభివృద్ధి చేశానని కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు మాట్లాడిన మాటలు కేసీఆర్ అసమర్థ పాలనకి నిదర్శనమని వారు అన్నారు. కేసీఆర్ కి , విద్యాశాఖ మంత్రి కి పట్టింపు లేదని.. కనీసం ఎమ్మెల్యే లు ఒక్క రోజు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్న పరిస్థితి లేదని విమర్శించారు. కేసీఆర్ మనుమడు పాఠశాలలోనే ఇన్ని సమస్యలు ఉన్నాయని అందుకే విరాళాలు ఇచ్చిన డబ్బులతో అభివృద్ధి చేశానని చెప్పాడని, పట్టణ ప్రాంతంలో ఉన్న పాఠశాలలోనే అన్ని సమస్యలు ఉంటే మరి రాష్టం లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు.

రాష్టంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయంగా ఉన్నాయని, ఒక్క పాఠశాలలలో కూడా సరైన మౌలిక వసతులు లేవని, సరిపడా ఉపాద్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదని తెలిపారు. మధ్యాహ్నం భోజనానికి గదులు లేవని, త్రాగునీరు, బాత్ రూం సౌకర్యాలు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయన్నారు. విద్యా సంవత్సరం మొదలై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు రాని పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. అన్ని పాఠశాలలు ఇలాగే విరాళాలతో అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం విద్యకు నిధులు ఇచ్చే పరిస్థితి లేదన్నట్లుగా ప్రభుత్వ విద్యపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుని ఆయన మనువడే ఎండగట్టాడని చెప్పారు. సీఎం కేసీఆర్ కి, విద్యాశాఖ మంత్రికి ఏమాత్రం విద్యారంగంపై ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ ఉంటే వెంటనే సమీక్ష చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని అన్నారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

Tags:    

Similar News