ఎన్‌కౌంటర్లు కావవి.. కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యలు

నారాయణపూర్, దంతేవాడలో జరిగిన ఎన్ కౌంటర్లు పచ్చి భూటకమని, 40 మందిని పొట్టన పెట్టుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దుర్మార్గమైన హత్యలేనని సీపీయూఎస్ఐ తెలంగాణ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి సి.రమేష్ పేర్కొన్నారు.

Update: 2024-10-07 08:03 GMT

దిశ, తుంగతుర్తి: నారాయణపూర్, దంతేవాడలో జరిగిన ఎన్ కౌంటర్లు పచ్చి భూటకమని, 40 మందిని పొట్టన పెట్టుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దుర్మార్గమైన హత్యలేనని సీపీయూఎస్ఐ తెలంగాణ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి సి.రమేష్ పేర్కొన్నారు. సోమవారం ఆయన “దిశ”కు ఒక ప్రకటన పంపారు. కేంద్ర రాష్ట్ర బలగాలు జరుపుతున్న ఈ మారణకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. 2026 లోగా నక్సల్స్‌ను అంతమొందిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలో భాగంగానే ఇది కొనసాగిందన్నారు. ఈ చర్యలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేదావులు తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆదివాసి, గిరిజన ప్రజల సాంప్రదాయాలు, జీవించే హక్కులు, వన్యప్రాణుల పర్యావరణం, తదితరవన్నీ కాలరాచి కార్పొరేట్ సంస్థల దోపిడీకి అనుకూలంగా కేంద్రం నడుస్తోందని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే గత పది నెలలుగా మావోయిస్టుల పేరుతో అడవి బిడ్డలైన ఆదివాసీ ప్రజలపై హత్యలు, అత్యాచారాలు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ హత్యలకు బాధ్యులైన మిలటరీ పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని, ఇప్పటికే అడవిలో తిష్టవేసిన వేలాది మంది పోలీసు మిలటరీ క్యాంపులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.


Similar News